పుట:కాశీమజిలీకథలు-12.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యజ - అట్లు మదీయగ్రహదౌర్భల్యంబున నెవ్వరికేని యాపద్మంబు దొరకుట సంభవించెనేని‌ నట్టివానివలన పరిభవము సంభవింపఁగలదు.

ఒకతె -- (భయముతో) అదెట్లు?

యజ -- (విసుగుతో) ఆగొడవంతయునిప్పుడేల? ఇఁక నీవనవిహారము జాలింతము నేఁడు నామనంబుననేమోరీతిగానున్నది‌ సత్వరమ పోవుదమురండని యామె దిగులువడిన మొగంబుతో సొధమునకుఁబోవ సమకట్టెను. ఆమె వెనుకఁ జెలిమికత్తియలందఱు భీతహృదయులై నడచుచుండిరి. నేనును గనంబడకుండ వారి వెనుక నాప్రాసాదసమీపమున నేగితిని. పిమ్మట వారందఱును సౌధములోనికిఁబోయి ద్వారములన్నియు మూసికొనిరి. నేనును చేయునదిలేక కింకర్తవ్యమూఢుండనై యా ప్రాంతమందలి తరుచ్చాయఁ గూర్చుని యుంటిని.

ఇంతలో నొకనూతనవ్యక్తి‌ యాప్రాసాదసమీపంబునకు వచ్చి నన్నుఁజాచి నివ్వెఱఁబడుచు నిలువంబడి యెవ్వరు నీవని గద్దించిపలికెను. నేనును నించుక సాహ సముదెచ్చుకొని లేచి మెల్లన వానిసమీపంబునకేగి యిట్లంటిని. అయ్యా ! నేనొక గంధర్వకుమారుండను కొండొక కార్యదీక్షంగైకొని విధినియోగంబున నేనిందేతెంచితిని. ముందు సేయఁదగిన కృత్యము దోపక యిందుఁ గూర్చుంటినని సంగ్రహముగా నాయుదంతము కొంతమఱుగు పఱచి చెప్పుచు మఱియు నిట్లంటిని.

నేను - ఆర్యా ! ఈసౌధమెవ్వరిది ? ఇందు నివసించియున్నవారెవ్వరు? మీరెందుండి యిచ్చటకు వచ్చుచుంటిరి? మీరుండు ప్రదేశమెచ్చట?

నూతనవ్యక్తి -- ఇయ్యది జలాధిదేవతాసౌధము. ఇందామెనూఱ్వుర చెలి కత్తెలతో నివసించియున్నది. నేను సరిత్పతి కింకరుండును. విరూపాక్షుండను వాఁడను మేముండు తావిచ్చటికి శతయోజనంబుల దూరంబున మహావర్ణవ మధ్యంబున నున్నది. మాయేలిక పంపున నేనీ జలాధిదేవత సన్నిధి కొకసందర్భంబునవచ్చితిని.

నేను -- ఈజలాధిదేవతకు నొడయుండెవ్వడు? ఈమె చరిత్రంబు విన గుతూహలంబగుచున్నది వినదగిన జెప్పెదవే?

నూతనవ్యక్తి - జలాధిదేవతకు సరిత్పతియొడయుండనియెఱుంగవాయేమి? ఒకరు సముద్రమధ్యంబునను నింకొక రీ కాసారమధ్వంబునను నివాసము లేర్చరచు కొని సర్వజల ప్రపంచ పరిపాలనంబొనరించుచున్నారు. ఇచ్చగలిగినప్పు డెప్పుడైన నీయిరువురును గలసికొనుచుందురు.

నేను - అయ్యా? నాయజ్ఞానంబునకు క్షమింతురుగాక. వీరికి సంతాన మేమైనఁ గలదా?

నూతనవ్యక్తి - ప్రమద్వయను నాడుబిడ్డయొక్కతె మాత్రము వీరికిఁగలదు.