పుట:కాశీమజిలీకథలు-12.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జలాధిదేవత కథ

283

ముతో కాసారగర్భంబు నలుమూలలు విమర్శించుచుండ నొకయద్భుత తేజంబు బొడ సూపుటయు నందుల కాత్మ నే వెఱఁగందుచు నావైపుననుఁబోయితిని. అందు బరీ క్షింప నాకొక సోపానమార్గము గోచరించినది దానివెంటఁ గొంతదూర మరుగునంత ముందొక సుందరహర్మ్యంబు నేత్రపర్వ మొనరించినది. అతిసాహసంబున నా ప్రాసాద సమీపంబునకు బోయిచూడ నం దెవ్వెరునులేరు ద్వారములన్నియు తెఱచి యుండుటచేతఁ దిన్నగా సౌధోపరిభాగంబునకు నిరాటంకముగా బోవఁగలిగితిని. అచ్చటఁగూడ నాకెవ్వరును గనంబడలేదు. ఆ యున్నత ప్రాసాదోపరిభాగంబునుండి నలుమూలలు క్రిందకు విమర్శింపఁ జేరువనున్న గృహనిష్కుట మధ్యంబున కొందఱు నీలవేణులు విహరించుచున్నట్లు గనంబడినది. తోడనే మేడదిగి నే నాయుద్యానవనంబునఁ బ్రవేశించితిని. పూపొదరిండ్ల మాటున పొంచియుండ యా యందజ యానలనీక్షించితిని శతసంఖ్యాకులగు చెలిమికత్తెలు పరివేష్టించియుండ నొక సుందరాంగి విలాసముగా నాయుద్యాన వనవిహారం బొనరించుచున్నది. అందొక దివ్య సరోవరముఁగలదు. దానియందు మిగుల నక్కజముగొలుపు పద్మము లనేకములు ప్రకా శించుచుండెను. అనారీమండలమున కధికారిణియగు ముద్దుగుమ్మతోడివారి నుద్దేశించి చెలులారా ! మునితనయునిసంరంక్షింపఁ దగుదుననివచ్చి యిక్కాసారంబు గగ్గోలుపఱచిన ప్రమధునికి గర్వభంగమగుటకు నేను సెప్పినట్లు చేసితిరా !‌ అనియడిగిన‌ది. అంత నందొకసుందరి ముందుకువచ్చి “అమ్మా ! నీయాజ్ఞ ననుసరించి యిందలిపద్మ మొకటి తీసి యాకాసారంబున నునిచి వానికి నివ్వెఱపాటును‌ గళవళమును జనింపఁజేసితిని. వా డింకను గాసారతీరంబుననే దీని తెఱంగఱయలేక మందునివలెఁ దిరుగుచున్నాఁడు వనవిహారసమయంబైన దని నేనిందు మగుడివచ్చితిని ఆపద్మమునట్లే దృశ్యాదృశ్యమగు నట్లచ్చటనే యుంచివచ్చితిని” అని చెప్పెను. అప్పుడు వారిరువురకు నిట్టిసంవాదముఁ జరిగెను.

యజమానురాలు - వేయేండ్లు తపంబొనరించినను దానిమర్మెంబెఱుంగ వానితరంబగునా ?

చెలి - దూరమం దున్నప్పుడు దివ్యతేజంబున బ్రకాశించుచు సన్నిధికేతెం చిన నదృశ్యమై తామరపాకువలెఁదోచు దానినెఱుంగ నొరుల కెట్లు శక్యమగును? సూర్యకిరణములతో నిమిత్తము లేకుండ నీ యాజ్ఞాబలంబున నాపద్మము క్షణములో వికసించుటయు దిరుగ ముకుళించుటయును పరమాద్భుతముగా దోపకమానదు.

ఇంకొకతె - దేవీ ! ఆ పద్మమర్మంబెఱింగి యతండు దానిం బట్టుకొ‌నిన నేమి జరుగును?

యజ - అట్లెన్నడును జరుగనేరదు. ఆ మర్మమెవరికిఁ దెలియగలదు ?

ఒకతె - కాకతాళీయముగ దామరపాకువలె దోచినదాని నెవ్వడై నఁ బట్టు కొన్నచో యేమగును?