పుట:కాశీమజిలీకథలు-12.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

277

మాయావి యల్లన గన్నులు విచ్చిచూచి వానియుదంతం బెఱింగియు నెఱుంగనట్ల డిగి వానిచే వెండియుం జెప్పించి యా యగ్రజన్మాధముండు వాని కిట్లనియె.

ఓరీ ! సమలోష్టకాంచనులై శిలోంధవృత్తిఁ గాలంబు గడుపుచున్న మాఁబోటి యోగులు ధనమున కాశించి నీచదానంబులఁ బరిగ్రహింతురా ! అయినను నీవు జాపుచున్న భక్తితాత్పర్యంబులకు నా యంతరంగంబున జాలివొడముచున్నది. పితృప్రీతిగ దానముసేయ నెంతధనము తెచ్చితివి ? తెచ్చినదంతయు నిచ్చెదవా ? నీ వలన దానముబట్టి నిన్నును నీ పితరులను నుద్ధరించి తత్పాపశాంతికై తపంబొనర్చెద ననుటయు వాఁడు‌ స్వామీ ! ధనము గొల్లలుగఁ దెచ్చితిని మీకు తృప్తిఁదీరునంతటి బంగారమిత్తును, ధనమంతయు నికొక్కనికే యిచ్చెదను. పరిగ్రహించి నన్నుఁ గృతార్థుఁజేసి తీర్థయాత్రాఫలంబు నాకు సమకూర్చుఁడని వినయంబున బ్రార్ధించిన వానిమాటలకలరి యా బ్రాహ్మణచండాలుండా జాతిచండాలునివలన దానప్రతి గ్రహంబు సేయుటకు సమ్మతించెను.

అయ్యంత్య జన్ముండు సంతసముతో నత్తీరంబున గోమయంబున బట్టు సేసి మార్తాండకిరణ స్పర్శంబున మాఱుమండు పదియారువన్నె బంగారము రాసిదా బోసి యాపట్టు సన్నిధిని యా బ్రాహ్మణుని గూర్చుండబెట్టి గంగాజలంబున తత్పాద ప్రక్షాళనంబొనర్చి భక్తితోఁ బూజించి యా స్వర్ణదానంబును ధారాపూర్వకముగా నిచ్చిన నా విప్రాధముండు సంతసించుచు నాపైడిరాసిగొని నిజనివాసంబునకుబోయెను. తీర్థయాత్ర సమాప్తము జేసికొని మహానందంబున నా చండాలుండును తనదేశంబునకు నిర్గమించెను.

మహానందుఁడు చండాలునివలన దానముగొన్న యుదంతంబు గాశిలోని విప్రులకెల్లఁదెలిసి వాని ననేక విధంబుల నిందింపదొడంగిరి. ఇట్టి పరమ పవిత్రమైన పురంబున నట్టి బ్రాహ్మణాధముండుండుట తగదని వానినటనుండి వెడలగొట్టఁదలం చిరి. వీధిలో వాఁడు గనంబడెనేని పలువురు బాలురు వానిజుట్టు మూగికొని చండాలుని చేత దానముగొన్న చండాలాధమా! ఈ పురంబునుండి వెడలిపొమ్ము లేకున్న బలవంతమున నవ్వల బారవైతుమని వెంబడించుచు రాళ్ళు విసరికొట్టువారును నుత్త రీయములాగి పారవైచువారునునై వాని ననేకవిధంబుల బాధింపగడంగిరి. వారి బాధ పడలేక యిల్లువిడచి బైటకుపోవుట మానివేసెను. ఇట్లు కొన్నిదినంబు లా వారణాశి పురంబున గాలంబుగడపి యిఁక నందున్న నాయూరిబాడబులవలన దనకు ముప్పు రాగలదని యెంచి యొకనాఁడు భార్యాపుత్రుల వెంటబెట్టుకొని యర్ధరాత్రంబున నా యూరువిడిచి పారిపోయెను.


క. చూచినవారెల్లరును ద
   న్నే చిన కోపమున నట్టువేయందొడఁగం