పుట:కాశీమజిలీకథలు-12.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మఱియు నతండు బేరముగా వేగుజామున నిద్రమేల్కొ_ని గంగాతటంబున కేగి తత్పవిత్ర జలంబుల కృతస్నాతుఁడై తీరంబున కేతెంచి సిద్ధాసనంబున మహా తపశ్శాలివలె జపము జేసుకొనుచుఁ జూపరుల కమితభక్తి జనియించునట్లు గన్పట్టు చుండును. ఒక్కొక్కప్పు డెవ్వరేని వానింగాంచి నమస్కరించి యేమైన సమర్పింప దలంపు జూచినప్పుడు నిష్కామకునివలె నటించుచు దృణీకరించుచుండును ధనవంతు లెవ్వరైనవచ్చి తాను తలచికొనినదానికన్న నిబ్బడిగా నిత్తురని తోచినప్పుడు వారి బలవంతముచేత నా దానముబట్టుట కంగీకరించుచుంటినని హరిని నమ్మించుచుండును. వాని యాకార నటనా స్వభావంబుల దిలకించిన పలువురు వానిని నిష్కామకుఁడనియు నవరోక్షజ్ఞానియనియు విశ్వేశ్వరావతారమనియును పెద్దగా నుతించుచుందురు. కాని వాని వేషము డాంబికమనియు నతండు నీచాతి నీచస్వభావుండనియు నెవ్వరును తెలిసికొనలేకపోయిరి.

నిత్యమును వానికిఁ బ్రదక్షిణములొనర్చువారును సాష్టాంగ దండ ప్రణా మంబు లర్పించువారును, మ్రొక్కులు జెల్లించువారును, నుపచారంబులఁ జేయు వారును. స్తోత్రములఁ బఠించువారును యథాశక్తిని కానుకల వానిముందుంచి పోవు వారునునై వాని నా గంగాతటంబున దేవునివలెఁ బూజసేయుచుందురు. ఉదయము మొదలు మధ్యాహ్నము రెండుజాములు దాటినదనుక నట్లుండి పిమ్మట నిజనివాసం బున కేతెంచి నాఁడు తెచ్చినదెల్ల ప్రియంవదకిచ్చి భుజించి నా యిందిందరవేణితో గేళీవిలాసముముఁ గాలము బుచ్చుచుండును. ఇట్లు పెక్కువత్సరములే యపాయమును లేకుండ గతించినవి. క్రమంబున వారి కిరువురు పుత్రులుద్భవించిరి. వారును దండ్రిని దుర్గుణంబుల నించుకయు దీసిపోవక వానికి దగిన తనయు లనిపించుకొను చుండిరి.

ఇట్లుండ నొక్కనాఁటి ప్రాతఃకాలంబున గంగాతటంబున వాడుకరీతి నుచితాసనంబున ధనాకర్షణంబున కాత్మీయ మాయావాగురంబులఁబన్ని మహానందుఁ డున్న సమయంబున నొక చండాలుండు బహుధనాడ్యుండు తీర్థయాత్రా ప్రసంగ మున కాశికేతెంచి భాగీరధీపవిత్రాంబువుల జలకమాడి యార్ద్రపసంబులతోఁ దటంబు జేరి యిటునటుఁజూచి పెద్దయెలుంగున నిట్లనియె. బ్రాహ్మణోత్తములారా ! “నేను చండాల జాతియందు జన్మించినవాఁడను ఉత్తమ బ్రాహ్మణునకు కోరినంత బంగారము దానము జేయచున్నాను నన్ననుగ్రహించి దయచేయుఁడు” అని మాటిమాటికిఁ గనంబడిన వారినెల్ల నడుగుచుండ నందున్న విప్రులెల్లరు మాలవానివలన దానంబు బట్టుట మహాపాప హేతువని యుపన్యసించుకొనుచుఁ దొలంగిపోయిరి. మహానందుఁ డొక్కడు మాత్రము జలింపని మనంబున గపటసమాధినుండెను. వాని సన్నిధి కాపుల్కసుండరిగి చేతులుజోడించుకొని మహాత్మా ! నా పితరుల యాత్మశాంతికి నే నిచ్చు దానంబుఁ బ్రతిగ్రహించి నన్ను ధన్యుని జేయుడని బ్రార్థించుటయు నా