పుట:కాశీమజిలీకథలు-12.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

273

ఘోరపాపహేతువు. మహారాక్షసకృత్యము. మేమట్టిపని చేయఁజాలము. బంగారముజేసి యిత్తునని మమ్మునమ్మించి మా యొద్ద రెండువేల నిష్కముల సంగ్రహించితివి. మా సొమ్ము మాకిమ్ము. నీ యాగము నీయొద్దనే యుంచుకొమ్మని బలుకుచున్నవారికి మహానందుడిట్లనియె.

ఏమీ ! మిమ్ము నేను మోసము చేసితినా ? ఈ యోగమును సాధించుటకు గొన్ని ఘాతుక కార్యములు జేయవలసి యుండునని నేను మొదటనే మీతో జెప్పలేదా అన్నిటికి మీరు సమ్మతించి నన్ను బలవంతముగ నిందుదింపి యిప్పు డేమియు నెఱుంగనట్లు మాట్లాడెదరాఁ మీరిచ్చిన సొమ్మెక్కడనున్నది. హోమద్రవ్యములక్రింద నిదివరకే పూర్తిగా వెచ్చింపబడినది. మీరిందులకిచ్చిన మొత్తముఁ జాలక యదనంగా నా ద్రవ్యమందులకు వినియోగించితిని. పదిదినంబులనుండి నేను పడిన శ్రమకు మిగిలినది యత్యల్పము. నేను జెప్పినట్లు చేయుటకు సమ్మతించిన నిందుండుఁడు లేకున్న మీయిచ్చవచ్చినట్లుఁ చేయుడు. మానిసి బలిలేకున్న నీ యాగము బూర్తి కాఁజాలదని దిటవుగాఁ బలికెను. వారామాటలు విని యొకరిమొకము లొకరు జూచు కొనుచుఁ దమ యాప్తుఁడగు ప్రభుత్వోద్యోగి కీయుందంత మెఱింగించి తదానతిఁ బ్రవర్తింప తలంపుఁగలిగి యతిరయంబున నందుండి వాని సన్నిధికేగి యా వృత్తాంత మంతయునుఁ దెలియజేసిరి. ఆ దురాశాపాతకుం డప్పలుకులు విని తలపంకించుచు నా యోగమట్టి దుష్కర కార్యసాధనమునగాని సమకూరునది కాదుకనుకనే యెల్లరకును వీలులేకున్నది. లేకున్న బ్రతివారును బంగారము జేసికొనుచునే యుందురు. ఎన్ని కష్టనిష్ఠురములఁ బడకుండ బంగారుకొండ లభ్యమగునా ? ఇంత ప్రయత్నముఁజేసి మీదిపని మానుకొనుట బుద్ధిమంతుల లక్షణముకాదు. అక్కార్యముఁగూడ నెరవేర్చి కృతకృత్యుల మగుటయే నా మతమని యుపన్యసించిన విని వారెల్లరును భయకంపిత స్వరంబున నయ్యో ! ప్రాణము లర్పింప నెవఁడు సంసిద్దపడును. దీని కెద్దియుపాయ మని యడిగిన నాయుద్యోగిట్లనియె.

హితులారా ! కార్యసాధనమునకు వెనుకముందు లరయుట బుద్ధిహీనత యగును. మనసు దిట్టపఱచుకొని యా సమయంబున కెవనినో కపటముఁజేసి యందు దీసికొనిపోయి బలవంతముగఁ జంపఁవలయు. నాయొద్ద జిరకాలమునుండి పనిచేయు దిక్కులేని పరిచారకుండొకండు గలఁడు. వాని నెద్దియో నెపంబునఁ దీసికొనిపోయి కావలయు పనియేమో దీర్చుకొనుఁడని యుపాయము జెప్పిన వారెట్టకేలకు సమాధాన పడిరి.

మఱొకనాఁడు మహానందు సన్నిధికేగి మిత్రమా ! నీవు జెప్పినపని జేయుటకు మేమొక యుపాయ మాలోచించితిమి. మే మానాఁటి కిచ్చటి కొక్క మనుజునిఁ దీసికొనివత్తుము. కాని వాని బలవంతముగ జంప మాకెవ్వరికి సాహసముఁ