పుట:కాశీమజిలీకథలు-12.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

దానెవ్వరితోను సంభాషింప వీలుండదనియును నటుపిమ్మటఁ జేయు పంచరాత్రదీక్షకు నెట్లున్నను భయములేదు గనుక నప్పటి‌వఱకు వారినెవ్వర నందురా రావలదనియుఁ జెప్పి యొప్పించి యామిత్ర బృందమును సాఁగనంపెను.

పిదప మహానందు డంగడికిఁబోయి యాపదిదినంబులకు సాధన సామగ్రి నంతయు సంగ్రహించి తెచ్చి యింటఁబెట్టుకొని వీధిమొగమెరుంగకుండ నింటిలో నా ప్రియురాలితో నిష్ఠగోష్ఠీవినోదంబుల హాయిగాఁ బ్రొద్దుపుచ్చుచుండెను.

పదియవదినంబున నొక యుచితస్థలంబున వేదికయు గుండమును నేర్పర్చి యాసన్నిధి నుండవలసిన వస్తువులెల్లఁ బొందుపఱచి తాను దీక్షితుని వేసమువై చికొని పదిదినంబులనుండియు నతినిష్ఠతో సవన తంత్రము నెరవేర్చునట్లు గనంబడుటకుఁ దగిన యానవాళ్ళను వెలయించి యాప్రదేశమున సిద్ధాసనంబునఁ గూర్చునియుండెను. పదు నొకండవనాఁటియుదయంబునకే యా మిత్రబృందమందే తెంచి యా దీక్షితుని యపూర్వతేజోవైభవంబెల్ల దిలకించి తమపూన్కె తప్పక నెరవేరఁగలదను దృఢ చిత్తులైఁ యందు చేయఁబడుచున్న కృత్యము లన్నియుఁ జూచుచుండిరి. మహానందుఁ డును వారికి హస్తసంజ్ఞచేఁ గూర్చుండ నియమించి కొంతతడవెద్దియో నోటమంత్రము లుచ్చరించుచున్నట్లు నోటగొణుగుకొనుచు హోమకుండమునకుఁ బలుమాఱు ప్రదక్షి ణంబు‌ లొనరించుచుఁ జాలసేపువరకు వారితో మాటలాడకుండెను.

మఱికొంతసేపటికి వారివంకఁదిరిగి మిత్రులారా ! చూచితిరా ! మీకోరిక నీడేర్ప నేనెంతశ్రద్దాయుక్తుండనై యీసవనదీక్షఁ బూర్తి జేసితినో ! ఇఁక నై దుదినములు మాత్రము లఘుప్రకియలఁ జరిపినచో స్వర్ణదేవతాసనము సమాప్తము జెందఁగలదు. ఇఁక మీయిచ్చవచ్చినప్పు డిందువచ్చి చూచిపోవచ్చును. ఈ యైదుదినములలో మీరొక కార్యమును సాధింపవలసియున్నది. ఆపని విన గ౦టకముగానున్నను నదిచేసిన కాని స్వర్ణయోగము కాఁజాలదు. ఈ యోగమున కుపకరించుఁ గొన్ని వనౌషధములు నా యొద్దఁగనవు కొన్ని యుత్కృష్ట లతాపత్రంబులును సంగ్రహించి యుంచితిని. వీటి రసమును పది దినములు మనుజకపాలంబున తన్మేదోమాంసరక్తంబులం గలిపి భూ పుటంబు బెట్టవలయును. అయ్యుపకరణంబులను మీరీఁగడువులోపల సిద్దపఱచి యుంచవలయుననుటయును వారు భయకంపితగాత్రులై మిత్రమా ! నీ మాటలు మాకు బోధపడకున్నవి. మేమేమిచేయవలయునో విస్పష్టముగాఁ జెప్పుమనుటయు నతండు మీరొక మనుజునిఁ దెచ్చి యీ దేవతకుఁ బ్రీతిగా నిందు బలియొసంగపలయును తరు వాతి కృత్యమంతయు నేన సవరించుకొందుననుటయు వారికించుక చకితులై అయ్యో! ఇదియేమియాగము బలియిచ్చుటకు మనుజుఁ డెక్క.డ దొరకును. దొరకినను నిండు ప్రాణముదీయ నెవండు సాహసించును. ఈమాట మొదటనే జెప్పనైతివేమిగదా? ఈ సంగతి తెలిసిన నిట్టికుచ్చయోగమునకు గడంగకుందుముకదా? ఈపనివలన బంగా రముమాట యటుండనిచ్చి ప్రభుత్వమువలన మాప్రాణములమీఁదికేవచ్చును. ఇది