పుట:కాశీమజిలీకథలు-12.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రియంవద కథ

265

ఆ ధూర్తురాలిభర్త మహానందుని మోముపరీక్షించి అయ్యో ! మిత్రమా ! నీ ముఖ మంతయు నెట్లు గంట్లు పడియున్నదో? నిన్నాభూతము మిక్కుటముగా ఱక్కినట్లున్నది రక్తమెట్లు స్రవించచున్నదో ! పాపము నేఁడు నామూలమున నీకు నిష్కారణముగా బాధగలిగినది. క్షమింపుము. ఈ భూతము తిరుగ నిందుఁబ్రవే సింపకుండ మార్గమాలోచింపుము. మిత్రుని రక్షింపుమని వేఁడుకొనుటయు నా డాంబికుఁడు వెండియు నిట్లనియెను.

మిత్రమా ! మిత్రకార్యము దీర్చుటకు నన్నింతఁ బెద్దగాఁ బొగడవల యునా ! ఆ భూతము నీవు తలంచినట్లు పైఁబడి రక్కుటచేతనే నా ముఖంబున నిట్లు గంట్లుఁగలిగినవి. వీనికేమి ? మఱునాటికి మానగలవు.

నీయిల్లాలి నావేశించినదొక గొప్పపిశాచము. దీని నుపేక్షింపరాదు గొన్ని దినంబు లతినిష్టతో మంత్రబద్దంజేసి యుచ్చాటనంబునగాని మారణంబునఁగాని నిర్జింప వలయు నూరకున్న నిది తిరుగఁబ్రవేశించి యెల్లర బాధింపఁగలదని పలుకుటయు, నతం డులికిపడి నాయందుఁ దయదలంచి యిందులకుఁదగిన ప్రతిక్రియ నీవే యాలో చింపుము. మా కులమునెల్ల రక్షింపుము. అని ప్రార్థించుటయు మహానందుఁడు శిరః కంపం బొనర్చుచు మీకిష్టమున్నయెడల నొకటి చెప్పెద నట్లుచేయుఁడు. "నీ భార్యతో కొన్నిదినంబులవఱకు నెవ్వరును మాటలాడకూడదు. ఆమెకంట నెవ్వరునుఁ బడఁ గూడదు. ఆమెనొక మారుమూలగదియందు బంధించి యుంచవలెను. నిత్యకృత్యములఁ దీర్చుకొనుటకుతక్క మఱెప్పుడు నీవలకు రానీయఁగూడదు. ఆమె నిద్రాభోజనాదులకు వలయు సదుపాయంబులన్నియు నాగదియందే యేర్పఱుపవలయును. మఱియు నందుఁ బంచవర్ణముల మ్రుగ్గులుపెట్టుట కనువగు పదార్థములను, నిర్మలజలపూరితమగు పాత్రంబును, దూపదీపనైవేద్యంబులకుఁ గావలసిన సంభారములను, సిద్ధపఱచి యుంచ వలెను. నేను ప్రతిదినమును గొంతకాలమువఱకు సంధ్యాసమయంబుల వచ్చి యాగది యందుఁ బ్రవేశించి పంచవన్నెలతో మ్రుగ్గులువ్రాసి యందామెను గూర్చుండబెట్టియిష్ట దేవతలనారాధించి నామె నావేశించిన మహాభూతమును వశముజేసికొందును. నేనందు మంత్రతంత్రముల నెఱపునపుడా ప్రాంతముల కెవ్వరును రాఁగూడదు. అట్లే తెంచిన నాకుఁ బ్రాణసంకటము గలుగుటయేకాక నీయింటివారికెల్ల ననర్దమురాగల” దని పలికి యూరకుండెను. అందులకు నాయింటివారెల్ల నొడంబడి యెట్లయిన నీ భూతబాధ దప్పింపుమని వానిఁ బ్రార్దించిరి.

నాఁటి సంధ్యాసమయంబున వెండియువత్తునని జెప్పి యా మాయావి తన యింటికరిగి తిరుగ యధాకాలమునకు శృంగారముగా నలంకరించుకొని నొసటపైఁ గుంకుమబొట్టు దట్టముగాదిద్ది చేతనొక పేకబెత్తమునుగైకొని యా యింటికేతెంచి యందామెనుంచిన గదిలోనికీపోయి తలుపు లోనబిగించుకొనియెను. అందు ముందుగా