పుట:కాశీమజిలీకథలు-12.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఇట్టిసమయంబున మహానందుఁ డందుఁ జేరి యెల్ల ర దూరముగా బొండని జెప్పుచు నత్తలోదరి కెదురుగా దిరిగి హుంకరించుచు నే నెవ్వఁడనో యెఱుందువా? నన్నుఁ దిన్నగా చూడుము: నీయాగడములు నాసన్నిధిని పనికిరావు. నీయట్టిభూత ముల వెగుర మారణము జేసిన మహానందునిగా నన్ను దెలిసికొనుము. అని పలుకు చుండగనే యాప్రోయాలు తటాలునలేచి వికటహాసము గావించుచు నీవెవ్వడవు! ప్రాణములమీఁదియాస వదలికొని యిందువచ్చితివని తోచుచున్నది రమ్ము నీపీచమడ గింతు నీమంత్రతంత్రములు నాయొద్ద పనికిరావు. నీపనిపట్టెదఁ గాచుకొమ్మని హుమ్మని వానిపైబడెను. అచ్చటివారెల్లరు బాబో ! యని పెద్దయెలుంగున నచ్చటినుండి యొకరి నొకరు త్రోసికొనుచు పాఱిపోయిరి.

మహానందుఁడు మంత్రవేత్తవలె “హ్రాం హ్రీం క్లీం నేం ఫట్‌” అను బీజాక్ష రము లేవియో యుచ్చరించుచు నామె పట్టుతప్పించుకొనుటకుఁ బెనంగువాఁడువలె నా సుందరి మర్మస్థానంబులెల్ల ముట్టుచు శిరంబు మూర్కొనుచుఁజుబుకంబుఁ బుణుకుచు శిరోజముల నిమురుచుఁ, జెక్కిలిముద్దుఁగొనుచు, నుదరంబునంటుచు, కంఠంబు గాఢాశ్లేం బొనర్చుచు, మదనోన్మాదంబున నామె స్వాంతంబును రంజిల్ల జేయుచుండెను. ఆమెయు వాని‌పైఁబడి నిర్జించునది వోలెఁ దదంగముల నాలింగనం బొనర్చుచు, మోము గఱచుచు, మోహావేశంబునఁ దత్సమయోచిత క్రీడల మైమఱచియుండెను. (ఆ మోహ నాంగిఁ నావేశించియున్నది మదనగ్రహమేగాని మఱొండెద్దియుగాదు. వా రిరువురుం గలసికొనుట కీయుపాయముంబన్ని మహానందుఁడు ముందుగా నామె కెఱింగించియే యుండెను.) ఇట్లు వా రిరువురు నొకరినొకరి జయించు నభిలాషకు ద్వంద్వయుద్ద మొనరించుచుండఁ దలుపుసందులనుండి నా యింటివారెల్లఁ దమ్ముజాచుచుండుట గ్రహించి మహానందుఁ డామెతో నికఁజాలును. నీయుద్రేకమిఁక నుపసంహరింపుమని సాభిప్రాయముగాఁ బలికి బిగ్గరగా చాలు ! చాలు ! నీవింకను బెంకితనముఁ జేసితివేని మారణహోమంబుననిన్ను భస్మంబొనరింతు. నాప్రభావ మిప్పటికైనఁ దెలిసినదా? అని చిటికెలువేయుచునేదియో మంత్రం బుచ్చరించుచున్నట్లు పెదవులు గదల్చుచు ముమ్మారామె మొగంబున నూచెను. తోడనే యాచేడియ నేలపై కొఱగి సొమ్మసిల్లి నట్టు పడియుండెను. అంత మహానందు నాయింటిపతి నుద్దేశించి యింక భయము లేదు‌. బ్రహ్మరాక్షసుఁ డీమెను వదలి పారిపోయెను. రండు ! రండు! అని పిలిచినంతనే వారెల్ల రందు గుమిగూడి నివ్వెఱ పడసాఁగిరి. వారింజూచి మహానందుఁడు అబ్బా ! ఎంతకష్ట పెట్టినది ఇట్టి మొండిదయ్యము నెందును గనివినియెఱుంగను. మహామంత్ర వేత్త నగుటచే దీనికి జిక్కక యీవలబడితినిఁ గాని సామాన్యుఁడైనచో నిష్కారణ ముగ దీనిచే నేఁడు చావవలసినదేఁ దీని నింతలోఁ బోనిత్తునా ! మారణకర్మంబునఁ బేరులేకుండఁ జేయనుండినగాని నాకోపము జల్లాఱదు. అనుటయు వానిమంత్రశక్తి నెల్లరునుబెద్దగా నగ్గింప దొడంగిరి.