పుట:కాశీమజిలీకథలు-12.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రియంవద కథ

261

అయ్యా ! మీ యౌదార్యము నేనెఱుంగనిదియా ! మీమీ యనుగ్రహం బునఁ బొట్టపోసికొనుచున్న నన్ను మీరింతగాఁ బొగడనక్కఱలేదు. ఆ యన్నుల మిన్న స్వాధీనమగుట దుర్ఘటమని తలంచి యనుమానించుచుంటినేగాని మీయట్టివారి కానందము గలిగించిన యెడల నా దరిద్రము తీఱుననుసంగతి నేనెఱుంగకపోలేదు. నేనిట్టి విషయములయందెన్నడు పనిచేసినదాననుగాను. ఏవిధమున నామెతో ముచ్చ టింపవలయునో నాకు బోధించిన యెడల సమయము దొరకినప్పు డామెతోఁ జెప్పి వచ్చెదను. ఇంతకన్న నాకేమియును జేతకాదని పలికినది.

అందులకాసుందరుఁడు సంతసించుచు మంచిది. ఆయలనాగతో మాట్లాడ వలసిన తెఱంగంతయు నేను నీకు బోధించెదను. ముందు నిన్ను గొన్నిసంగతు లడి గెదను. దానికి సమాధానమిమ్ము ?ఆ తొయ్యలి నెయ్యముతో నీతో మాట్టాడుచుం డునా ? నిత్యమామె యేమి చేయుచుండును. ఆమెయందు భర్తయనుకూలుడై యుం డెనా ? అత్తమామల కాపెయందెట్టి యభిప్రాయమని యడుగుటయు నాచెడి పె యిట్లని యెను. బాబూ ! ఆమె చాలమంచిదానివలెఁ గనంబడును. నేను నిత్యము వారింటఁ బనిచేయుట కేగినప్పుడు పెరటిలో నాకెప్పుడు నామె యొంటరిగా గనుపింపలేదు. ఇంటి చాకిరీ యంతయు నామె యొక్కతియే చేయవలయును. అమె వెనువెంట నత్తగారు దిరుగుచుఁ దప్పులుపట్టుచుండును. ఏమనినను దిరుగుబాటుచేయదు. మగనితో రాత్రి యెట్లు వేగుచున్నదో నేనెఱుంగఁగాని యుదయము మెదలు జీఁకటిపడువఱకును నామె నత్తగారు బానిసలాగునఁ బనిచేయించుచునే యుండును. ఆమెయం దేమినేర మారో పించిరోగాని కొన్ని దినంబులనుండి వీధిమొగము జూడకుండ నామెనుఁ గట్టడిచేసిరి. పగలంతయును నామె యంతరంగమునఁ గనిపించుచుండ నెవ్వరితోడను మా‌ట్లాడక దన నియతంబులఁ దీర్చుచుండును. ఇన్నినాళ్ళనుండి వారింట నేను బనిచేయుచున్నాను గాని యామె నవ్వుమొగము నే నెన్నఁడును జూచియెరుంగను. ఇదియె యచ్చటి వృత్తాంతమని జెప్పినవిని యతం డిట్లనియె.

ఓసీ ! నీవీదినమున వారింటికేగినప్పు డాయబలామణియొంటరిగా నున్నప్పు డెద్దియో మిషఁబన్ని సన్నిధికేగి యామెతో “నాఁడు గోదావరీజలంబునఁ బడిన నీ బిందెను వెతకి నీకిచ్చిన పురుషుఁడు నిత్యము మనయింటికి వచ్చి నీక్షేమ మఱయుచునే యుండెసుమా” యని మాత్రము చెప్పము దాని కేమి చెప్పునో విని నాకుఁ తెలియఁ జేయుము. నీ యింటికి సాయం సమయమున వెండియు వత్తునని చెప్పిపోయి తిరుగ యధాకాలమునకు దానింటికేతెంచి దాని రాకకై వేచియుండెను.

ఆ ముసలిది వచ్చి యా పురుషునిఁ జూచి మందహాసము జేయుచు బాబూ ! మీరు బోధించిన మాటలు తడబడుచు నామె చెవినెట్లో పడ వేసితిని. ఆమె నామాటలు విని మొగము బై కెత్తి నన్నుచూచుచు నీ సంగతి నీ కెట్లు తెలిసినది. ఎవ్వరితోడను జెప్పకుసుమీ ! ఇది మావా రెఱింగిన దప్పుపట్టి ఱంపమునఁ బెట్టి కోయగలరని చెప్పు