పుట:కాశీమజిలీకథలు-12.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నీవామెతోఁ చాలసేపు ముచ్చటించుచుంటివి నీకామె పూర్వపరిచితయా యేమి? అని యడుగుటయు వారికప్పటి కెద్దియో సమాధానముఁ జెప్పెను. కొంతతడవునకు వారెవ రిండ్లకు వారు పోయిరి.

ఆ కనకాంగి నీక్షించి నప్పటినుండియు మహానందుని చిత్తము చిత్తజాయ త్తమై దశవిధావస్థలకు పాల్పడుచుండెను. మఱునాడు మహానందు గాబిత్తఱియత్తవా రింటికేగి దానిమగనితో మైత్రిఁ గుదుర్చుకొనెను. దానిం బురస్కరించుకొని నిత్యము వానిగృహంబునకు వచ్చుచు బోవుచుండెనేగాని వానికెన్నఁడును నా పద్మగంధితో ముచ్చటించుట కవకాశము గలుగకుండెను.

ప్రియంవదకథ

నాఁడు గోదావరీజలంబులఁ దెచ్చుటకుబోయి తిరిగివచ్చుటకు మిక్కిలి జాగై నదను కారణంబున నాయంబుజాక్షిపై లేనిపోని నిందలెన్నియో మోపి యిట్లొం టిగాఁ బోనిచ్చినఁ గులంబునకేమి కళంకము దెచ్చి పెట్టునో యను భయంబున నట్లు పంపుట మానివేయుటయే గాకుండ నంతర్గృహంబున నుండి యెన్నడును బైటకు రాకుండఁ గట్టుదిట్టములు జేసిరి. దానంజేసి‌ యామెనీక్షించుటకైన మహానందునకు వీలు గలుగకుండెను.

అందులకాతఁడొక యుపాయ మాలోచించి యాయింట బనిచేయుచున్న చేటికకు కొంతరొక్కమిచ్చి దానితో పరిచయము గలిగించుకొనెను. ఆ జెంత మహా నందుని యభిప్రాయ మెఱింగిముక్కు పై వ్రేలిడికొని అమ్మా ! యెంతమాట! ఆ బాలికామణి కడుముద్దరాలు. అత్తగారు కత్తులబోనులోబెట్టి కట్టడులం బెట్టుచున్నను సహించుకొనుచున్నది. అంతటి మంచిగుణములుగల యిల్లాలి నెందును నేను గనివిని యెఱుంగను అట్టిసాధ్వి నీకు స్వాధీనమగుటఁ గల లోనిమాట నీకామెయందు గల మరులు మరలించుకొనుమని చెప్పుచుండ నాతం డిట్లనియె.

మంధరా! నీవు మంధరయంతటి దాన వగుదువు నీవు తలంచిన యాపని యనుకూలమగుట యొక వింతలోనిదికాదు నామీఁద దయ తప్పుటచేత నిట్టిమాట లను చుంటివని దోఁచుచున్నది. నిన్నుఁ బరమేష్టి తక్కువకులంబులోఁ బుట్టించి తొలి జామునఁ జేసినదోషంబు కారణమున నట్టి నీచవృత్తి సంభవింపఁజేసెనేగాని నీకున్న బుద్ధికుశలతకుఁ బుడమి పరిపాలింప సమర్దురాలవని‌ నాకొకప్పుడు తోఁచుచుండును.. నాకీమాత్ర ముపకారముఁ జేసి పెట్టుము. నీకు మంచి విలువగల సరిగంచుచీరఁ గొని పెట్టెదను. నామాటలు నీకు నమ్మకము లేనియెడల నీవీ పదిమాడలు ప్రస్తుతము తీసి కొనుము. కార్యసాఫల్యమైన పిదిప నాయావిఁ జూచెదవుగాకయని యా మాడలాతొత్తు చేతం బెట్టిన యంతనే యది ముసిముసినవ్వుతో నిట్లనియె.