పుట:కాశీమజిలీకథలు-12.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహానందుని కథ

259

ఇట్లు మాయావియై వర్తించుచు వాఁడొక్కనాఁడు కొందఱు వేడుక కాండ్రతోఁ బ్రాంతనిర్మల స్రవంతికాసైకత ప్రదేశంబులకు విలాసవిహారమున కేగి యచ్చోటవారితో విచ్చలవిడి ముచ్చటలాడుకొనుచుండగా నొకవేదండయాన మంద గమనంబున నదీజలంబును గొనిపోవ నేతెంచి జలపాత్రము నదిలోజారవిడచి దాని కొఱ కందందు వెదకి కనుంగొనజాలక జాలిపుట్టునట్లు ప్రాంతమందున్న జనులం గాంచి యిట్ల నియె.

పురుష పుంగవులారా ! ఈ నదీగర్భంబున నా జలపాత్రము హస్తంబుల నుండి జారిపడియెను. దానిని వేగమ వెదకి నీరంబులఁ గైకొని మద్గృహంబున కేగకున్న మా యత్తగారు పెనుభూతమువలె నన్ను బాధింపఁగలదు. ఆమె మాటయే యూతగొని నా మగఁడు నన్నుఁ జితుకగొట్టక మానఁడు. మామగారు గయ్యాళియగు భార్య నేమియు ననఁజాలక మీఁదుమిక్కిలి‌ యామె సంతసించుటకు నన్నే చీవాట్లు పెట్టును. ప్రమాదంబున నదిలోపడిపోయిన బిందెకొఱకు నాకీ దినంబున వారివలన గలుగు వెత దైవంబెఱుగు. అదియునుంగాక నిందు బుద్ధిపూర్వకముగ జాగుచేసితినని పదప్రహారములు నాకుదప్పవు. మీరెవ్వరో నే నెఱుంగను. మీకు సుకృతము రాఁగలదు. నాబిందివెదకి నాకీయరే ! యని ప్రార్థించుటయును నంతకుముందె యామె యంగసౌందర్యం బీక్షించి పంచశరుని తూపులకు నేపుచెడి మన్మధావస్థలం బడుచున్న మహానందు డామెమాటల నాలకించి మించిన వేగంబున నచ్చోటికిబోయి నడుము బిగించుకొని తత్పాత్ర చేజారిపడిన ప్రదేశ మెఱింగి యందు చాలవఱకు వెదకి యెట్టకేల కాబిందెను బైకిఁదీసి యామెచేతి కందిచ్చెను.

ఆమదవతి ముదిత హృదయయై యా పురుషుం డొనరించిన యుపకార మునకు సంతసించుచు నా సొగసుకానింజూచి మందస్మిత సుందరముఖారవిందయై మీ మేలు నేనెన్నఁడును మరువఁజాలనని బలుకుచు బిందెతో నదీజలంబు వెడలివచ్చి యచ్చతుర శృంగారవిలోకనంబుల వానిపైఁ బరఁగించుచు సుందరుఁడా! పోయి వత్తునా ! నిత్తఱి నేనంకేమాత్రము జాగుచేసినను నా యత్తగారు నన్ను సాధింపఁ గలదు. నామగఁడు శిక్షింపఁగలడు. తఱియొదవు నప్పుడు నీవు నాకుఁజేసిన యుప కృతికి ప్రతిఫలము జూపింపఁగలనని పలుకుటయు నతండు ముఖకమలంబు వికసింప నిట్లనియె. తరుణీమణి ! నీ కృతజ్ఞతకెంతయు సంతసించితిని. నీ గృహంబెచ్చట ? నీకుల మెయ్యది? నీమగని పేరెయ్యది? నీయత్తమామ లెట్టివారు? నీ యుదంతము నే విన నర్హుండనని నీకుఁతోచినఁ జెప్పి నన్ననుగ్రహింపుమని యడుగ వాని ప్రశ్నల కన్నిటికి‌ సమాధానము జెప్పుచు బిందిబుజముపైఁ బెట్టుకొని మెల్లగా ముందుపోసాగెను. మహానందుఁడును నామెవెంట నింటివఱకును దానుబోయిన, నితరులు తప్పుపట్టుదు రనియు, తోడివారెల్ల పరిహసింతురనియు వెఱపుతో విధిలేక యామెనువిడచి తన మిత్రులసన్నిధి కేతెంచెను. వానింజాచి తక్కినవారు పరిహాసము చేయుచు నోహో !