పుట:కాశీమజిలీకథలు-12.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

బొండు చెప్పెద దానివలన మీరడిగిన యర్ధంబు తేటపడగలదని యిట్లని చెప్ప దొడంగెను.

343 వ మజిలీ

మహానందునికథ

భూలోకంబున గోదావరీతీరమున భౌవనంబను పట్టణరాజ మొండుగలదు . ఆ పురవరమున గౌశికుండను విప్రుఁడు భార్యతోఁ గాపుర‌ మొనరించుచుండెను. అతండు పండితుఁడను పేరునొంది ధనికుఁడై ప్రఖ్యాతివహించియుండఁ బెద్దకాలమున కాతనికి మహానందుడను నందనుఁడు గలిగెను. వాఁడు జనించినవేళ యెట్టిదోగాని యేడవదినమునఁ దల్లియు రెండవమాసము రాకమున్నే దండ్రియు బరలోకమున కేగిరి. మాతాపిత్రు శూన్యుండగు వాని బంధుజనులుపెంచి పెద్దవానింజేసిరి. అవినయ నివాసంబైన యౌవనకాలమున విషయాసక్తుండై శ్రోత్రియ‌పుత్రుండయ్యు మాతృ దోషంబున నా మహానందుఁడు కులోచితధర్మంబుల మఱుగువెట్టి కోడెగాండ్రం గూడి కామక్రోధ లోభమోహమదమాత్సర్యాది దుర్గుణంబుల కాటపట్టయి వర్తించుచు పైతృక మెల్ల దుర్వినియోగము జేయుచుండెను. మరియు నతండు జార చోరపానద్యూత క్రియలందు దక్షుండై విద్యాశీల శౌచంబులకు దూరుండై -


ఉ. వాఁ డల జవ్వనంబునను ♦ వాడలవాడల సంచరించుచు
    న్వేడుకకాండ్రతోడ పృధి ♦ వీస్థలి నొప్పగు నాటకతైలం
    గూడుచు నెల్లవిత్తముల ♦ గొల్లగబుచ్చుచునుండె యెంతయు
    న్గూడఁగఁబెట్టు విత్తమున ♦ కున్‌ లయకారులు దుష్టపుత్రులే.

మఱియు నతండు,

సీ. ఎంతవారలనేని నింతలోపల నగ్గఁ
            పఱచిపెద్దగవారి పజ్జఁదిఱుఁగుఁ
    దగవుపూనిన రెండుదెగలవారికి రోస
            మెక్కించి యుడుపక చిక్కు పెట్టు
    గుదిరిన పెండ్లిండ్లు చెదరఁగొట్టుచు
            వెండి సవరింపఁ బెక్కులంచములఁగోరు
    దనమీదలేనిపెత్తనము వెట్టుకొని వెంబడి
            నన్ని పనుల ముందడుగువెట్టు

    నొక్కతరి నెడకాడు వేరొక్కవేళ
    వెచ్చకాఁడను జూదరి ముచ్చునగుచు
    ఎన్నియేపాట్లు బడి గణియించురొక్క
    మంతయును వెచ్చఁబెట్టు వాఁడనుదినంబు.