పుట:కాశీమజిలీకథలు-12.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధర్వుని కథ

257

తీరంబున విశ్రమించియుండుము. కర్దమపుత్రుని వృత్తాంతము విమర్శించి వత్తునను టయు నా ప్రమధుండిట్లని‌యె.

కచ్చపవంశప్రవరా నీ యుదంతం బతి విచిత్రముగాఁ గనంబడుచున్నది. నీ రూపము త్రిలోకదుర్లభముగా నున్నది. నీ మాటలు విన్నాణములై యొప్పుచున్నవి. నీవు కామరూపుఁడవని తోచుచున్నది నీ జన్మ ముత్కృష్టమైనది. గాకున్నను నిట్టి విశేషంబులు నీ యందుండుట కెద్దియో కారణ ముండకపోదు. నీ యుదంతము పూర్ణముగా వినువఱకును నామనంబున శాంతియుండదు విన నర్హమేని వక్కా ణింతువే యనుటయు నా పురుషుండు దరహసిత ముఖారవిందుడై యా యీశ్వర దూత కిట్లనియె.

గంధర్వుని కథ

శాపాంతమును బ్రసాదించిన దివ్యపురుషునితో‌ నా పూర్వ వృత్తాంతము మఱుగువెట్టిన కృతఘ్నుండనగుదును. వినుము నేనొక గంధర్వ కుమారుండను సుభాహుండను నభిధానమున నొప్పుచుండువాఁడను. రూపయౌవన కళావిశేషంబుల ననవద్యుండనై మెలంగుచు నొకనాఁడు గొందఱ మిత్రులతో నానందమున నిష్టగోష్ఠి వినోదంబునఁ జెలంగియుండుతఱి నెచ్చటినుండియో కలహప్రియుండగు నారదముని యచ్చటకు విచ్చేసెను. వానింగాంచి మేమెల్లరము ప్రత్యుత్థానం బొనరించి యుచితా సనంబునఁ గూర్చుండఁబెట్టి వినయంబునఁ‌ దామెందుండి యిందువచ్చి మమ్ములఁ గృతార్థుల జేసితిరని యడుగ నారదముని యిట్లనియె.

గంధర్వ బాలకులారా ! భూలోకంబున నవిముక్తక్షేత్రంబనియు నానంద కాననంబనియుఁ బ్రసిద్ధికెక్కిన కాశీపురంబున కఱిగి యందు విశ్వనాధుండనుపేర లోకంబు లేలుచున్న పరమేశ్వరుని సందర్శించి వచ్చుచుంటినని జెప్పెను. వాని మాటలకు మాతోడివారెల్ల అక్కజపడి మౌనిచంద్రమా ! ఈశ్వరుని స్వరూపమును వలసినప్పుడు కైలాసమందు వీక్షింపఁగలుగు భవాదృశు లెచ్చటనో పుడమియందున్న గాశికిం బోవుట చిత్రముగా నున్నదికదా ! అప్పురంబు మనుజులకుఁ బుణ్యతీర్థంబై యుండిన నుండుగాక ! మీయట్టివారు నందఱుగుటకు గారణమేమో మేమూహింపఁ జాలకున్నామని యనుటయు నామునికంజరుఁడు నాలుకఁ గఱచుకొనుచు నెంతమాట ! నేనేకాదు, త్రిలోకములయందలి వారును గాశీక్షేత్రంబుజూడ ముచ్చటపడుచుందురు. బ్రహ్మవిష్ణ్వాదులెల్ల నా క్షేత్రమునుఁ దమలోకముకన్న మిన్నగఁ జూచుచుందురు. కాని యట్టిక్షేత్రత్ప్రభావంబెఱింగిన మీరిట్టి శంకఁ జేయరనుటయును, వారు గాశీక్షేత్ర ప్రభావము నెఱింగింపుఁడని ప్రార్దించిన నాదేవముని తత్ప్రభావద్యోతకంబగు నితిహాసం