పుట:కాశీమజిలీకథలు-12.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నీ‌ కష్టమంతయు నరణ్యముల పాలుచేసిన పాపాత్ముండను నేనే. నీ వంగడి కేగినప్పు డా పెట్టె నపహరించి మారుమూల మార్గంబున బయలుదేరి వచ్చి యీ యరణ్యంబున నొకచో నామందస మూడదీసితిని. లోపలనున్న యర్ధశకలంబులఁ జూచి విభ్రాంతుఁ డనై చేసిన పనికి సిగ్గుపడుచు నప్పుడు చేయునదేదియులేక వాటి నందే బారవైచి యింటి కేతెంచితిని. ఇది యంతయు యధార్దము. నామాట నమ్ముము. నాపెట్టెలో యెముక ముక్కలు తప్ప నింకేమియు లేవు. మిమ్ములను మోసము జేసితినను మాటయే మిగిలినది నీ పాదముల తోడని పలికెను.

అంత ధనంజయుండు వాఁడు తనతల్లి యస్థులఁ బారవేసిన ప్రదేశము వాని నడిగి తెలిసికొని వానితో నచ్చోటికిఁబోయి వెదకించెను. కాని యెందును వాని జాడ గనంబడినదికాదు. వాఁడా ప్రదేశమును దై వయోగంబున సరిగా గుర్తు పట్టలేక పోయెను. చూచిన చోటులే జూచుచు వెదకిన ప్రదేశములే వెదకుచు తిరిగినమార్గములే దిరుగుచు నీరీతి వారెంతఁ బ్రయత్నించినను గార్యము లేకపోయినది. అప్పు డావై శ్యుఁడు చేయునదిలేక తల్లిఁగూర్చి పెద్దగా వగచి తన యభాగ్యత ననేకవిధంబుల నిందించుకొనుచు నాకిరాతుని వదలి మగుడి కాశీపురంబున కేతెంచి యందు గంగానదిం జలకమాడి విశ్వనాధుని సందర్శించుకొని యెట్టకేలకు నిజపురంబునకుఁ దిరిగిపోయెను.

వింటివా ! విశ్వేశ్వరుని యాజ్ఞ లేనిదే యాకోమటి యవ్వ యస్థులైనను గంగలో కలుప వీలుగలిగినది కాదు. నీవు‌ కాశికిం బోనక్కరలేకుండగనే యంతకు రెండింతలు సుకృతము సంపాదించుకొనగల యవకాశమున్నది. కాశీయాత్రాపరు లీ మార్గంబుననేగాని బోవుట కన్యమార్గంబులేదు. ఈమజిలీ దాటుటకు వారుపడు కష్టము లకు మేరలేకున్నది. ఈ మహారణ్యమందు కాశికిబోవు యాత్రికులకు తగిన సదుపా యంబులఁ గల్పించుచు, వారికి దోఁపుడుగాండ్ర వలన గలుగుచున్న బాధలు లేకుండఁ గాపాడుచుంటి వేని కాశికిం బోకుండగనే సహస్రగుణితంబగు సుకృతంబును సంపా దించుకొనవచ్చును. మఱియు మీజాతియందు నీవంటి క్రూరకర్మపరాజ్ముఖుం డుండఁడు. నీపూర్వపుణ్యంబున నీయందు సుగుణంబులన్నియుఁ జేరినవి. నీవు కారణజన్ముండవు. నాహితవచనంబులు పాటించి నేఁడు మొదలు జంతుహింసమాని ప్రతిదినంబును తీర్థ యాత్రాపరులకు కందమూల ఫలాదులొసంగి తృప్తులంచేయుచు సత్కరించుచుండుము. మార్గస్థులు తస్కరబాధ లొందకుండ కాపాడుచుండుము. సతతము కాశీవిశ్వనాథుని మనంబున తలంచుచుండుము. దానంజేసి నీకు పుణ్యలోకంబులు గలుగఁగలవని కొన్ని మోక్షధర్మంబు లుపదేశించి యాశీర్వదించి యాజటిలుండు తనదారిం బోయెను.

పింగాక్షుండును నాభిక్షుకుని యుపదేశమే వేదవాక్యమట్లు పాలించి తీర్థ యాత్రాపరులు నడుచు మార్గమందు గంటక పాషాణాదులం దొలగించి‌ నడువ యోగ్య ముగా నొనరించుచు, నెడ నెడ వారు విశ్రమించుటకు శీతలచ్చాయల నీయ సుందర తరుబృందముల బాట కిరుప్రక్కల బెంచుచు, చలువ పందిళ్ళు వేయించుచు, ఫల