పుట:కాశీమజిలీకథలు-12.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దనంజయుని కథ

251

నాపాపము పటాపంచ లయ్యెను. భవద్దర్శనమాత్రంబుననే తుచ్చముఖంబులపై నస హ్యమును మోక్షముపై నపేక్షయు గలిగినది. దుఃఖబహుళంబగు నీ సంసారమునందు బడియుండుటకు నాకిష్టము లేకున్నది మీతో నేను కాశికిం జనుదెంతును. నన్ను వెంటఁదీసికొనిపోయి మోక్షమార్గంబుఁ జూపింపుఁడు యిదియే నాప్రార్దన యని వేడు కొనుటయు నా పరివ్రాజకుం డల్లన నవ్వుచు నిట్లనియె.

భిల్లతల్లజా ! నీమంచిబుద్ది కేనంతయు సంతసించితిని. కాశికిం బోవుట యనేక జన్మసుకృతపరిపాకంబునంగాని లభింపజాలదు. ఇందుల కొక యితిహాసము గల దాకర్ణింపుము.

341 వ మజిలీ

ధనంజయుని కథ

దక్షిణాపథంబున సేతుబంధ సమీపమున నొక్కగ్రామంబున ధనంజయుఁ డను వైశ్యోత్తముండు గలఁడు. అతనితండ్రి చిన్నతనమందే పరలోకమున కేగెను. వానితల్లి భర్త లేనిచింత నొకమూలకు ద్రోసివేసి కుమారున కేలోపము రాకుండ బోషించుచు విద్యాబుద్ధులు చెప్పించి యుక్తవయస్సున తగిన సంబంధముదెచ్చి పెండ్లి చేసెను. ధనంజయుండు విశేషధనవంతుడు గాకపోయినను గృహకృత్యంబున కిబ్బంది పడకుండ వర్తకమున ధన సమార్జనం బొనరించుచు మాతృసేవా పరతంత్రుఁడై మంచివాడుకలోనికి వచ్చెను. వానితల్లికి పిన్ననాటినుండియును గాశి కేగవలయునని యుత్సాహముండునది. ధనలోపంబున గొన్ని నాళ్ళు తీసుకొని వెళ్ళువారులేక కొన్ని దినంబులును, మంచితోడు గుదిరినపుడు, బోవచ్చునను నుపేక్షచేత గొన్నినాళ్ళును వ్యాధిగ్రస్తురా లగుటంజేసి కొంతకాలము, నన్నియు సమకూరిన నప్పటి కేదియో యాటంకముచేతను ప్రయాణము నిలుపుచేయుచు నొకప్పుడు మనుమరాలి పురుటి దినంబులనియు నింకొకప్పుడు మనుమని వివాహమనియు నిట్లెప్పటికప్పుడెద్దియో యొక యభ్యంతరము వచ్చుచునే యుండెను. కాని యెప్పటికిని యామెకోరిక తీరినదికాదు. ఇంతలో వార్ధక్యము పెనుభూతమువలె వచ్చి మీఁదబడినది. కన్నుచూపు తగ్గినది. రదసంబులశక్తి సన్నగిల్లినది. దేహంబున వణకుబుట్టినది. శ్రోత్రేంద్రియవ్యాపారము క్షీణించినది. అహారము తగ్గినది. ఒడలిలో రోగ మంకురించినది‌. ఇట్లుండినను నా యిల్లాలికిఁ గాశికిపోవలెనను కుతూహలము పోలేదు. నిత్యమును కుమారునితో నాయనా ! నన్నెట్లేని గాశికింజేర్చి యొక్కమారు గంగాస్నానంబు జేయించవా ! యని దీనురాలై చేప్పుచుండునది. కుమారుడును అమ్మా ! నీదేహమున స్వస్థత గలుగఁగానే తప్పక కాశీయాత్రఁ జేయించెదనని ప్రత్యుత్తరం బొసంగుచుండెను. ఇంతలో వ్యాధిముదిరినది. కృతాంతకుం డెంతటి కఠినహృదయుండో కాని యాయవ్వ కోరిక దీరకుండగనే మించిపోయినట్లు కక్షవహించినట్టు యామెప్రాణంబుల నీడ్పించు