పుట:కాశీమజిలీకథలు-12.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురప్రవేశము కథ

247

వెంటరా నుదయసుందరీ తారావళులతో బ్రాంతవిహారశైలంబునకఱుగ బయలుదేరెను. తారావళియు నుదయసుందరియు నొక్కయశ్వశకటమునందును తానును కుమార కేసరియు నొక్క యశ్వశకటమందును గూర్చుండి ప్రాంతవిహారశైలంబున నశ్వ శకటంబులనుండి దిగి కుమారకేసరిపైఁ జేయూని ఉదయసుందరీ తారావళులు తోడురా పచ్చికబయళ్ళతో నికుంజమంజరులతో సాంద్రద్రుమసందోహములతో నతిసుందర మగు కుసుమ సుందరమును విలాసోద్యానమునందలి దివ్యమాణిక్య మందిరంబున బ్రవేశించిరి.

ఇంతలో పాతాళంబునుండి వైవాహికపరికరములతో కతిపరి పరివారములతో ప్రభువగు శిఖండతిలకుని యానతిని తారావళిజనకుండు రత్నమౌళి యచ్చటి కేతెం చెను. అతండు తాదెచ్చిన బహువిధ దివ్యాభరణంబులు నుదయసుందరికొసంగి నరలోక దుర్లభంబగు వస్తుజాతమెల్ల నా రాజేంద్రున కొసంగి దంభోళివలన మీ సంబంధము శిఖండతిలకుం డెఱింగి బంధుజనంబుతో నధికానందంబునొంది యామో దించెనని పల్కుచు వారికి యధావిధిగ పరిణయమొనర్చెను. పిదప రాజానతిని తన కూఁతురు తారావాళి కుమారకేసరి కొసంగి యతివైభవంబున నచటనే వివాహం బొనర్చెను. పిదప రత్నమౌళి యా రాజేంద్రునిచేత వివిధ సత్కారంబులం బొంది యుదయసుందరి యొనర్చు తప్పులనెల్ల క్షమించుచుండుమని రాజేంద్రునివేడి రాజు హృదయానుకూల ప్రవర్తనంబున నుండమని యుదయసుందరికిం బోధించి యుదయ సుందరి ననవరతము హితం బొనర్చుచుండుమని తారావళికిఁజెప్పి తారావళి ననురా గంబున నేలుకొమ్మని కమారకేసరిని ప్రార్థించి, వీరినందఱను వీక్షించుభారము నీ యందే యున్నదని వెండియు, రాజును బ్రార్థించి వారినెల్ల వీడ్కొని పాతాళంబున కేగెను.

గోపా ! వినుము వైకుంఠ సభయందు గరళకంఠునిచే శపులైన నింద్ర చంద్రులే పుండరీక కుమారకేసరులై జన్మించిరి. పార్వతిశాపంబున నహల్యాతారలు పాతాళంబున యుదయసుందరీ తారావళులుగా జన్మించి భూలోకంబున కష్టపరంపర లకు లోనై పుండరీక కుమారకేసరులను వివాహమాడి మరియు ఉత్తర జన్మంబున గంధర్వలోకంబున హంసునకు ఉదయసుందరియే మహాశ్వేతగను చిత్రరధునకు తారా వళియే కాదంబరిగను నీశ్వరీ వరప్రసాదంబున జన్మించి కాదంబరీ మహాశ్వేతలు యింద్రచంద్రుల రూపాంతరంబునను చంద్రాపీడ పుండరీకుల వరించి వివాహమాడి సంతానము బడసినంతనే నారాయణ వరప్రసాదంబున శాపంబుదొలఁగి యధాస్థితిగ బొందుదురు. చంద్రుఁడు శాపగ్రస్తుడైన కతంబున నతనిభార్య రోహిణి నతని ననుస రించి పూర్వభవంబున మధుర యను పురంబున కుమారకేసరి భార్యగను ఉత్తర జన్మంబున చంద్రాపీడుని తాంబూలరండవాహినగనుండి రూపాంతరములనున్న భర్తకు శుశ్రూష యొనర్చెను.