పుట:కాశీమజిలీకథలు-12.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

జేరెను. ఆ నగరము వెలుపల నా విమానమునుదిగి సమీపముననున్న నందివృక్ష శీతలచ్ఛాయకేఁగి యందుఁ బుండరీకుండు బ్రక్క నుదయసుందరియును నెదురఁ దారావళియునుండఁ గూర్చుండెను. పిమ్మట విమానరూపమును విడచి దివ్యాకృతిం బూని మాయాబలుండు కృతాంజలియై వారియెదుట నిలిచి యిట్లనియె.

దేవా ! అటుచూడుము. కోఁతిం దరుముకొనిపోయిన మన భూనాధుండు దానుగోరిన తరుణీమణి నెచ్చటనో లభింప నామెం దోఁడ్కొని తిరిగి యేతెంచియున్న వాఁడని జెప్పికొనుచుఁ బరుగుపరుగున బరిజనులెల్ల నిం దఱుదెంచుచున్నారు. కావున నోక్షితిపాల పుంగవా! నన్నిందే విడచిపపెట్టుము. నీవు తలంచికొనినంతనే నే నెవరి కిని జెప్పకుండ త్వరితగతి నేతెంచితిని. నీ వియోగంబున నెంతకాలము మసలితినో యెఱుంగను. ఇందులకుఁ బ్రభువగు విభీషణుఁ డేమని తలంచుచున్నాఁడో తెలియదు. అని పలుకుచు వానిమాటల నాదరించి యా ధాత్రీశ్వరుండు నావాంఛితమెల్ల సమకూర్ప గలిగిన నీకేమి పారితోషిక మొసఁగగలను ? వలసినప్పుడు నా శరీరమే నీ యధీన మొనరింపఁగలవాడనని యత్యంత స్నేహభావంబున వచించి యా రాత్రించరుని వీడ్కొల్పెను.

ఇంతలో నలువైపులనుండి యత్యంతానందమునఁ బురజనులు గుంపులు గుంపులుగా నచ్చోటి కరుదెంచసాఁగిరి గ్రమంబున మంత్రిసామంత హిత పురోహిత బృందమెల్ల నేతెంచెను. ఛత్రచామరాది రాజలాంఛనములెల్ల గైకొని సకలపరివార మేతెంచెను. అందఱికన్న ముందుగఁ గుమారకేసరి ఱేనిసమీపముకఱిగి వానికి నమ స్కరించి జరిగిన వృత్తాంతమెల్ల దెలిసికొనెను. పిదప నా చక్రవర్తి యెల్ల వారిని దగిన రీతి నాదరించి యుదయసుందరితో భద్రదంతావళం బధిష్టించి ముందు మంగళధ్వనులు జలరేగుచుండ మహావైభవంబున బురప్రవేశ మొనరించెను.

అట్లు వారేఁగుచుండ వారిని జూచువేడ్కచే విలాస వ్యాపారములనెల్ల విసర్జింను యతిరయంబునఁ బరువెత్తుకొనివచ్చి కామినీలోకము సౌధశిఖరములయందును గవాక్షములయందును దోరణ ద్వారములయందును నిల్చియుండిరి. అమ్మహారాజు ప్రియురాలితో నాపురవీధుల నూరేఁగును. నూరిజనులచే ననేకవిధంబులఁ బొగడ బడుచు ప్రకృతివర్గమువలన నభినందింపబడుచు, బ్రతి గృహద్వారము మ్రోలను బుణ్యస్త్రీలవలన నీరాజనంబులఁ వడయుచుఁ, బౌరజన సువాసినీ‌ బృందము మధుర మంగళగీతములఁ బాడుచుండ, వందిజనులొనర్చు జయధ్వానము నింగి ముట్టుచుండ దేవేంద్రవైభవంబున వివిధమణి తోరణోపచార చర్చితంబయిన రాజమందిరమును ప్రవేశించెను.

343 వ మజిలీ

మఱునాఁడు సాయంకాలమున బుండరీక రాజేంద్రుండు కమారకేసరి