పుట:కాశీమజిలీకథలు-12.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ములో నుండెనో నేనించుకయును గ్రహింపజాలకున్నాను అదృష్టవశంబునఁ దారా వళికూడ యిచ్చటనే‌ యున్నది. ఆమె యంబరమునఁ దిరుగుశక్తిఁ గలిగియున్నను నబలయగుటచే సంతోషమున మైమఱచియుండెను. కావున నిప్పుడు దిక్కుల నిర్ణ యింపనేరదు జంతుసంచారశూన్యంబగు నిక్కాననంబున నేదిక్కునకుఁ బోవలెనని యడుగుటకుఁగూడ మనుష్యుఁ డెందును గోచరింపఁడు ఈ యడవి దాటిపోవుట కుపాయ మేదియును దోఁపకున్నది ఆ విద్యాధరునికథ వినుచు మాకుధోరణింబడి వాని నీమాట యడుగుటయే మఱచిపోతిని. అంబరమున సంచరించచు ఖేచరులు సాధారణముగా భూలోకమందలి పట్టణంబులనెల్ల నెఱిఁగియుందురు ఆ విద్యాధరుఁ డట్లు పోవుచు నెద్దియేని యాటంకమునఁ కదల నింకను నిలచియున్నాఁడేమో పరికిం చెదంగాక యని తలంచుచు రిత్తకోరికతో గగన మీక్షించుచుండ నన్యోన్యసంగతమై, యేకప్రమాణమై. యేకరూపమగు స్వరూపముతో, నుదారపక్షములతో నొప్పు పక్షి యుగళమొకటి వానికి గోచరించెను. చూచుచుండఁగనే యది పక్షిభావమునువిడచి సుందరపురుషస్వరూంపబులఁ దాల్చి గగనమునుండి భూమికిదిగి ప్రియురాలిం గూడి యున్న నరేంద్రుని దూరమునుండియేచూచి రయంబున నికటంబున కేతెంచి వారిరు వురకు నమస్కరించెను.

మీరెవరని యాభూజాని విస్మయంబున నడుగ నందొకండు కృతాంజలియై వినయంబున నిట్లనియె. దేవా ! విశ్వోదరాంతరమగు కామినీరత్నమును వెదుక నాఁడు భవదీయాదేశసారుండను నేను మాయాబలుండును నిశాచరుఁడను. ఇతఁడు పాతాళనాయకుండగు శిఖండతిలకున కాప్తుఁడు. దంభోళియను భుజంగవీరుఁడు. స్వామి యాదేశమున భరతవర్షంబున నీమెను వెదకుటకు వచ్చినవాఁడు. నేను తమయానతి పాతాళమును దివంబును నామూలచూడముగ విమర్శించి యీ భూలోకమున కేతెంచి తిరుగుచుండ సౌరాష్ట్ర దేశమందలి ప్రభాసతీర్థంబున నీతండు నాకుఁ గనిపించెను. అం దనవరితయాత్రాయాత జనసమ్మర్థంబున దుర్దర్శనుండై దర్శనమాత్రంబుననే యర్దులకోర్కె లీడేర్పగల శ్రీ సోమనాధేశ్వరుని నిష్టార్ధసిద్ధికై ప్రస్తుతించు సందర్భం బున మేమిరువుర మొక్కపనిమీఁదనే తిరుగుచుండుటఁ దెలిసికొని మిత్రులమైతిమి. నాఁటినుండియు స్వేచ్చావిహారమున కనుకూలమగురీతిని బక్షులమై సంచరించుచు నిం దనింద్య జలశకుంతకూజితారావసూచితమైయొప్పు సరోవరము నీక్షించి యంబరమునఁ దిరుగుచుండుటచే మేమిరువురమును శ్రమజెంది చల్లని యీ మహాసరస్తీరంబున నించుక విశ్రమింపనెంచి మనుష్యరూపంబులఁదాల్చి యిచ్చటి కేతెంచితిమి. తోడనే భాగ్యవశంబున వధూసమేతుఁడవైయున్న నిన్నీక్షించి దంభోళి కెఱింగించితిని. అభీష్ట పరలాభంబున జెలంగియున్న యన్నుమిన్న తనయేలిక కన్న కూఁతురని యతండు వచించెను. మాకోరిక సిద్ధించెను. మా మనోరథము ఫలించెను, వేయేల ?