పుట:కాశీమజిలీకథలు-12.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్ర సమ్మేళనము కథ

241

భూమీంద్రచంద్రా ! చెప్పెద నాకర్ణింపుము. ఈ లోకమున మేరుభూధర వప్రోపకోణమందు దివ్యభువనంబులఁ బ్రసిద్ధికెక్కిన కోశాతకి యను విద్యాధరపురం బొండుకలదు. దానికినే నేలికను. తారాకిరీటుఁడను విద్యాధరుఁడను. అంధకవిపాట కుండగు పరమేశ్వరుండు పాతాళంబున హాటకేశ్వరుండనఁ బ్రసిద్ధికెక్కి యుండెను. వానిని సేవింప నేను బ్రతి యష్టమీ చతుర్దశుల నందేఁగుచుందును. ఒక యష్టమినాడు వాడుకవడుపున నా దేవుని దర్శించి నఱిగి యందు భక్తాభీష్టఫలకల్పపాదపుండగు జండీశుని భక్తితో నర్చించి యా దినమంతయు నందుఁగడపి కృతకృత్యుడనై యా రాత్రి నాగలోకము విడిచి పోవుచు నొకచో సముద్రాంతర్ద్వీపమందు వెన్నెలలోఁ దెల్లముగ గన్పట్టుచున్న యొక సౌధాగ్రమునఁ బచ్చనియాకుపందిరి క్రింద బూ సెజ్జపై బవళించియున్న యీమె నీక్షించితిని. దూరమునుండియే యామె వదనము నీక్షించి యిట్లు వితర్కించుకొంటిని.


మ. అది రోలంబకదంబకానృతశిరంబై విప్పు పద్మంబొ ? య
     య్యది నూత్నాసమనీలిమాంకశుభగంబౌ చంద్రబింబంబొ ? లే
     కది నిక్కంబుగ మానిసీకురుల జాలాక్రాంవమౌ మోముకో ?
     అదిరా! యిట్టివిచిత్రసృష్టి విధివిఖ్యాతిన్ గదన్‌ గాంచెడిన్‌.

అట్లు ముద్దుగుమ్మయని నిశ్చయించి యనేక సురలోక నాయికోపభోగ క్రీడాకృతార్దమైన‌ మన్మనం బాత్రిభువనమోహనాకారమును గావించినతోడనే తద్వశం వదమయ్యెను. అప్పుడు నేనిట్లు తలంచుకొంటిని. ఈ బాలికాభరణ వివాహితకాదు గదా ! కన్యక మేయైనను ననురాగంబున స్వయముగా వరించివచ్చినప్పుడుగాని యామె తలిదండ్రు లొసంగినప్పుడుగాని పురుషుండు పరిగ్రహింపదగును. ఈమె వివాహితయే యైనచోఁ బరాంగనయై యగమ్యయగునుగదా ? శిశిరోపచారపరిచయంబు గలిగియున్న నీమెను బూర్వానురాగముగల ప్రియతముని నెడఁబాసి విరహార్తిఁబడియున్న పరాంగ నఁగా భావింతునని దలంచుచు నంతలో వివేక మెడల మైమఱచితిని. వంశమర్యాదల మఱచితిని. సుకృతపథంబు మఱచితిని. గురూపదేశముల మఱచితిని. లోకప్రవృత్తుల మఱచితిని. కేవలము దురాత్ముండగు మన్మధహతకునిచేఁ బ్రేరితుండనై, దుష్కార్య చరణపదాయణుండనై, నరకగతివలన సంజ్ఞితుండనై , యపయశోకళంకమున నభ్యనుజ్ఞాతుఁడనై, యిదియే వివేకము, యిదియే వంశమర్యాద, యిదియే సుకృత మార్గము, యిదియే గరూపదేశతత్వము, యిదియే లోకప్రవృత్తియని దలంచి సంసార మును సఫలంబుగఁ జేసికొందునని నిశ్చయించి నిద్రనుండి‌ లేవకుండగనే యొరు లెఱుంగకుండఁ గొనిపోవనెంచి సమీపించి ప్రవాళతల్పంబున నిద్రించు నామె నెత్తుకొని వచ్చి నా విమానమునఁ బరుండఁబెట్టి యలబ్దలాభమును గాంచినట్లు సంతసించుచు అంతరిక్ష మార్గంబునఁ బోఁదొడంగితిని. అంబరముననున్న శశాంకబింబమును