పుట:కాశీమజిలీకథలు-12.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్ర సమ్మేళనము కథ

237

జూపఁ బఱపితిని. ఆ కొండ కొనయందు దూరముగా నొకమారుమూల ఘనలతా గుల్మముల విహితమై గరుడుని ముక్కునుండి జాఱిపడిన యమృత భాండమునుండి కారిన‌ సుధవిధంబున మధురజలంబు గలిగి తాండకేళీలోలుఁడై న బాలేందుమౌళి జటా మండలినుండి త్రుళ్ళిపడిన గంగాంబుసటలంబువలె నొప్పుచు, బ్రహ్మదేవుని చేతినుండి పడిన కమండలు పాత్రమువలె నలరారుచు, కల్పాంతవాతమువలనఁ ద్రెళ్ళిపడిన చంద్ర బింబమువలెఁ బ్రకాశమానమై, గట్టులొరయుచుఁ జిన్న చిన్న యలలతో నొప్పుజలాశయ మొండు గనంబడెను.

దానిం గాంచి యతిహర్షంబు నచ్చోటి కేఁగి దప్పికిం దీర్చుకొన ముక్తా మరీచిసంచయ్యస్వచ్చమై యతిశీతంబులగు నాజలంబుల బుడిసిళ్ళం గ్రహించి కడుపు నిండఁ గ్రోలితిని. ఆజలము గ్రోలినతోడనే నేను తొంటిరూపము విడిచి యశ్వము నయితిని. నిముసమాత్ర మచ్చటినుండి నన్ను నేఁ దలంచుకొని యిట్లు విచారించితిని. ఔరా! ఇట్లు దేహపరివర్తన మొనరించు జలంబుల మాటల పూర్వము మునులు జెప్పిన పురాణగాధల నాకర్ణించియంటిని. అన్నా ! మందభాగ్యురాలనై డప్పిగొన్న నా కీ నీర్వట్టేమిటికిఁ గనంబడవలె? కనంబడెనుచో దీని నేమిటికి సమీపించి వెంటనే యిందలి నీ రేమిటికిఁ ద్రాగవలెను? త్రాగిన వెంటనే నోటిలోఁ జేయి వెట్టుకొని వమన మేమిటికి జేసికొన నయితిని? ఆహా ! విధివిధాన మతి విచిత్రముగదా! అని‌ యనేకరీతులఁ జింతిం చుచు నా కొండక్రిందఁ బుడమిపై సరసదూర్వాప్రవాళశాద్వలం బగు తృణస్తంబం బును గాంచి యాఁకటిచిచ్చుఁ జల్లార్చుకొననెంచి దానిపై కుఱికితిని. పై నుండి యట్లు భూమిమీఁదం బడినతోడనే నాకుఁ బూర్వజ్ఞానము బోయినది. పిదప నే నెచ్చట నుంటీనో, యొందేగితినో, యెందెందుఁ బరిభ్రమించితినో, యెవనిచే నే నిచ్చటకుఁ దీసి కొని రాఁబడితినో, యెట్లు నిజస్వరూపము నందఁగలిగితినో, నాకేమియు దెలియదు. కేవలము దైవ మనుకూలుఁ డగుటచేతనే మన మిందుఁ గలిసికొనఁ గలిగితి మని యత్యంతసంతోషమునఁ బలికి యూరకుండెను.

అప్పు డా యుదయసుందరి ప్రియసఖీ ! తారావళీ ! నా కెఱకెంత కష్టపడి తివి? నా మనోవిషయనాయకుని యన్వయనామ వసతులు నీ వెఱింగియున్నను, వానిని నీవు చూచియున్నను దైవవిధి వలన నిటుల మనము వానికి దూరమై యుండవలసి వచ్చెను. నా మనోహరుండు మనకుఁ దిరుగఁగనంబడునా? అయో! ఎట్లగుపడును? ఎపుడు గనంబడునని విలపించుచు విపాదదోదగ్రవేగంబున వివశయై పడిపోయెను తారావళి యడలుచు హా! ప్రియసఖీ ! హా ! నిజవంశ వై జయంతీ! హా ! కందర్పవిజయ లక్ష్మీ ! హా ? త్రిభువనాలంకార ముక్తామణీ ! ఏమిది ? ఇట్లచేతనురాల వైతివేమి? అస్తం గతమైన చంద్రబింబమువలె జగమునంతయు నంధకారబంధురముగ నొనర్చుచుంటివి గదా ! హా ! హా ! యెంతమోస మని ప్రలాపించుచు మొగముమీఁద జల్లుటకై సలిలమును గొనివచ్చుట కతిరయంబున బరువెత్తుకొని పోయెను.