పుట:కాశీమజిలీకథలు-12.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


మ. వనమం దిఁట్లనిలార్కసత్కరసుసంపర్కంబు మాత్రంబె నేఁ
     గనుచున్‌ వానరరక్ష గాసిపడుచున్‌ గాఢాంగజాతాగ్ని పీ
     డను గాసారమృణాళపద్మముల జాడన్‌ గొంతశాంతించు కొం
     చును దైవాధికనిర్ణయంబు గనుగొంచున్నేవసింతున్‌ గదా.

కాని యాప్ల వంగపుంగవుఁడెవ్వరో, యెందుకొఱకు నాసమక్షమందుండి యిట్లు సంరక్షణ మొనర్చుచున్నాఁడో, నే నెట్లిచ్చటకు రాఁగలిగితినో, నాకేమియును దెలియదు నేఁడు వాడుక వడువున నీకాసారమునసాన్న మొనరించుచుఁ జూడామణిని దీసి దేవపూజకు వేళ యతిక్రమించుచున్న దను తొందరతో దానిని చీరచెంగునఁ జుట్ట పెట్టి వదులుగ ముడివై చితిని. పిమ్మట దేవపూజ నిర్వర్తించుకొని త్వరితగతిఁ బోవుచు దానిమాట మఱచితిని. అమ్మణి బరువు వలన వసనాంచలమునుండి జాఱి యెందో పడి పోయెను. ఇచ్చటఁ జేరిన పిదప నారత్నము మాట దలంపునకు వచ్చుటయును దానిని వెదుక దూర మరుగనక్కఱలేదుగదా యనియును నే నెం దేఁగినను సాయము వచ్చు కోఁతి నేఁ డెవ్వనిచేతనో బాధింపఁబడిన ట్లతిశ్రమంబున నేతెంచి యలసి నిద్రించు చుండుటచేత దానిని లేప నిచ్చగింపక యేకాకినై యిప్పు డిచ్చటి కేతెంచితిని. ప్రియ సఖీ! సంక్షేపముగా నీవృత్తాంతముగూడఁ జెప్పుము. నన్ను విడచినది మొదలు నేఁటి వఱకు నీ వేమిచేసితివో, యశ్వరూపమున నా మనోహరుండు గనంబడెనేమో చెప్పు మని ససంభ్రమంబుగ నడుగుచున్న యుదయసుందరికి తారావళి నిజవృత్తాంత మిట్లు సంగ్రహముగాఁ జెప్పదొడంగెను.

సఖీ ! వినుము. నాఁటియుదయంబున నిద్రనుండి లేచి నిన్నుఁగాంచక మిగుల దుఃఖించుచు నీ తల్లి దండ్రుల కీదుర్వార్తఁ దెలియఁ జేసితిని. మీతండ్రి శిఖం డతిలకుండు ని న్నన్వేషింప నెల్ల లోకములకు దూతలం బుచ్చెను, నేను స్వయముగా నిన్నన్వేషింప బయలుదేరితిని. ఒక్కచో నన్నొక రక్కసుండు జూచి మదనమోహి తుండై తఱుముకొని వచ్చి నిగ్రహింపఁబూన నీ హృదయనాయకునిచే సంరక్షింపఁ బడితిని. వాని కులగోత్ర నామ నివాసంబు లెఱింగితిని. ఆ యనఘుండు కుమార కేసరిని నాకుఁ జూపి వాని వృత్తాంతము జెప్పి నీకుఁ బ్రాణప్రదంబయిన చిత్రపటమును గూడఁ జూపించెను. దానిని నేను చూచినతోడనే భవద్వియోగదుఃఖము నాకు ద్విగుణిత మయినది. నీయందలి యనురాగంబున వలవంతఁబడుచున్న నారాజేంద్రుని జూడజాలక యారాత్రి యెట్లో వెళ్ళించి తరువాతఁ బుష్పాపచయ నెపంబున బయలుదేరి యాపు రంబు విడచి నిన్ను వెదకుటకుఁబోతిని పిమ్మట నే ననేక గ్రామాగ్రహార పురపట్టణం బుల వెదకుచు నతి వేగంబున నంతరాళంబున నరుగుచు నొకచోట మధ్యాహ్నతరణితీ వ్రతాపంబున విహ్వలనై భ్రమభరాలసంబులగు చూపులకు ముందెల్ల నంధకారమై గనుపింప నెందయిన విశ్రమింపనెంచి యొక పర్వత శిఖరమునకు దిగితిని. అందొక ముహూర్తకాలము గడపిన పిమ్మట దప్పిచేఁ బెదవు లార నీర్వట్టుకొఱ కందందుఁ