పుట:కాశీమజిలీకథలు-12.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్ర సమ్మేళనము కథ

235

సరికి నే నీసరోవరతీరంబున నుంటిని. నాయెదల నొక దివ్యచూడామణి యలంక రింపఁ బడియుండెను. దాపున మహాదేహదారుణమైన యొకవానరము గాపుండెను. ఇంతకుఁదప్ప నా కేమియుఁ దెలియదు. పిమ్మట నేనతి భయాకులితచేతస్కనై యిట్లు విలపించితిని.

అయ్యో ! నే నిప్పు డెచ్చట నుంటిని ? తామరపాకుల పందిరిక్రింద నేను నిద్రించుచున్న యాసౌధశిఖర మేమైనది ? చేరువనే నిద్రించుచున్న తారావళి యెచ్చట నున్నది ? ఉదయమునకు పూర్వమే నా సమీపమున కేతెంచి సర్వదా నన్నుఁ గని పెట్టుకొనియుండు చెలిమికత్తియ లేమైరి ? ఉదయమున లేచినతోడనే నా యభివాద నము లందికొను తల్లిదండ్రు లెం దుండిరి ? ప్రభాతమంగళోపగీతగర్భితమై ప్రబుద్ధ పరిజనారావడంబరమై, కలకలలాడు కన్యాంతఃపుర మేమైనది ? హా ! దురావసదుం డగు విధిచే నిహతురాల నయితినిగదా ! ఈ యరణ్య మెక్కడిది ? ఈ కొండ యెక్కడిది ? ఈ కాసార మెక్కడిది ? సమీపమం దీమర్కట మెక్కడిది? అని యడలుచు నాలుగువైపులఁ దిలకించుచుండ మనుష్యజ్ఞానముగల ప్లవగమందుండిలేచి ముందు నిబిడతరులతాడంబరమై నికుంజాంతరితమై యింద్రనీలమయమై యొప్పు నీ గిరిభిత్తకను నిజభుజబలంబున నాకర్షించి యూడఁదీసెను. అందు హంసతూలికా తల్పంబుచే నలంకరింపఁబడియున్న మాణిక్యభవన మొండు గోచరించెను. దానినే నాకు వసతిగా నేర్పఱచి యవ్వలీముఖంబు మదీయచరణసంవాహనాది విహితసుఖ సూచకోపచారంబులవలన నాయెడదఁగల యలజడి నుడువదొడగెను.

పిమ్మట నాప్రాంతోపవనమందలి తరులతాదుత పుష్పములఁగోసి సరస్సు నందలి కుమలకువలయంబులఁ గ్రహించి వానినెల్ల నొక పెద్దయరఁటియాఁకులో బెట్టి తెచ్చి ముందుంచి నాయడుగులు బట్టి కొనియుండెను. నేను దాని యింగిత మెఱెంగి, యందుండిలేచి యా సరోవరంబునకేఁగి జలకమాడి యాకోఁతి తెచ్చినపుష్పములతో నిష్టదై వంబులఁబూజించి తిరిగి వచ్చుసరికి మాణిక్యభననంబున ననేక నవపక్వఫలం బులు నాకాహారమునకై సిద్దపఱుపబడియుండెను. వానిం దిని యాఁకలి యడంచు కొంటిని. చీఁకటిపడినతోడనే నేనందున్న తల్పంబున శయనించియుండ నాకోఁతి ద్వారదేశంబుననిల్చి గావలి యుండెను. ఇట్లు ప్రతిదినమును జేయుచు, ఫలాలాదికము నకై బైట కేఁగునప్పు డం దితరులు ప్రవేశింపకుండ నాగిరిభిత్తిని నిలిపియుంచి నా యునికి నితరులకు గోచరింపకుండఁ జేయుచుందును ఇట్టిదురంతవన గహ్వరంబునఁ బడి దిగ్ర్భమఁజెంది యెందుఁ బోవలెనో యెఱుఁగకుంటిని. మఱియు నాకోఁతియెదుట యెందైనఁబోవ నడుగుఁదీసి యడుగైనఁ బెట్టుటకు వీలులేదు. అతిబలసంపన్నుఁడగు గపిప్రవరుండాశ్రయించియున్న కతంబున నీ యరణ్యంబునందలి వనజంతువులెల్లను నిలువజాలక భయంబున దూరముగాఁ బాఱిపోయినవి.