పుట:కాశీమజిలీకథలు-12.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్ర సమ్మేళనము కథ

233

పడుచు నతికుతూహలమున నమ్మణిని గ్రహించి రూపాంతరమునువిడచి క్రొత్తగా నున్న దారావళిపై నిశ్చలదృష్టులంబరపి చూడసాగెను.

ఆమెయును స్వస్వరూపలాభమునకు ముదమందుచు నాగిరి సరోవరముల వలన నిరుద్దమధ్యమగు నా మహారణ్యంబును విస్మయంబుతో నిటునటుఁ బరికించి “సాధుసాధు" దేవతలు చిరకాలమునకు నా కోరికను దీర్చి యనుగ్రహించిరి. క్రూరవన చరావతారదారుణారణ్యంబుననున్న నీకాసారతీరమునఁ ద్రిభువనలక్ష్మీసీమంతరత్నము నుచితావస్థానదుస్థితిం గాంచుచున్నదిగదా ? యని వలుకుచుఁ జేతులెత్తుకొని యతిజవం బున నా కొండకెదురుగాఁ బరువెత్తఁదొడంగెను.

ఆమె ప్రవృత్తిని దిలకించుచున్నా రాజామాటలకు శంకించుకొనుచు నౌరా ! ఈ పలుకులు నాకర్ద మగుటలేదు. మణి నాయొద్దనే యున్నది. ఆమె యాకొండ కెదు రుగాఁ బోవుచున్నది. అని విస్మయపడుచు నావంకచే చూచుచుండ మొదట వాని కాపర్వతముతప్ప యేమియును గనుపింపలేదు. పిమ్మట నకస్మాత్తుగా నాగిరిగర్భంబున విచిత్రనవరచనామనోహరంబగు మాణిక్యమణిమందిర మొండు గోచరమయ్యెను. అందుండి మత్తమాతంగయానము ననుకరించు విలాసగమనంబున నేతెంచుచు వెనుక రాజు చిత్రపటంబునుజూచిన రూపమునే పోలుచు, శరిబింజశకలిముల నిర్మింపఁబడి నటులఁ, జందనము బూయఁబడినరీతి. కర్పూరము జేర్పఁబడినపోల్కె, పద్మసౌభా గ్యము నింపఁబడినగతి యమృతమున ముంచఁబడినటుల నేత్రానంద మొసఁగు స్వరూ పమున నొప్పుచు, సుఖకుసుమమున శోభించు చరణ పల్లవసంపదచే సౌభాగ్యభూమి యందు ప్రభవించిన యభినవ లతవలె నలరారుచు, రతినివాసమునకుఁ గల్పింపబడిన చిత్రశాలవలెనే స్నిగ్దోరుస్తంభంబులందాల్చి కందర్పకులాలుని కర్మశాలయటుల నిశాల జఘనచక్రంబున నొప్పుచు, శృంగారరససమాసాదనకై జాతిగేంద్రవిద్యయందువలెఁ గంభీరమైన బొడ్డను మూసతో నలరారుచు సౌందర్యదేశాంతరంబులఁ బ్రవహించు నది వలెనే పవిత్రయతరంగములఁ జెలంగుచుఁ, ద్రిభువనలక్ష్మియొక్క రత్నావళివలె సువృత్త పీవరస్తనయుగళంబగు మాణిక్యనాయకమణుల వహించుచు, లావణ్య సాగర తీరమువిధంబునఁ జూపుమీలచే నలరారు నెన్నుదురుఁగాంచి తారుణ్యభనిటువీరవృత్తి చందంబున భ్రూచాపలవలయంబువహించి, బ్రహ్మాండసరోవరమందలి పద్మినివిధం బున ముఖసరోజసుందరయై త్రిభువనమనోహరముగా విధాతచే నిర్మింపఁబడి దృష్టి దోషమునకు వెఱచి యొరులు జూడకుండున ట్లీయరణ్యగహర్వంబున విడువఁబడిన రీతి నొప్పుచు వేడుకగాఁ బుడమిసంచరించు జలదేవత చందంబున మృణాళికాభరణమై కమలవనంబునఁ గ్రీడింప వెడలిన లక్ష్మివిధంబున కరకలితలీలాంబుజయై, చల్లగాలికి సరసీతటంబున విహరించు వనలక్ష్మివలెఁ గుసుమోత్తసంభాషితయై, యతివిమలాం తశ్చటలకు ధారాగృహమై, కందర్పకుసుమమునకు ఫలంబై, లావణ్య వారికి తీర్ధమై,