పుట:కాశీమజిలీకథలు-12.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

గల్పించుచుండును. తీవ్రమగు నెండలోఁ దిరుగుటచే నలసియున్న యీ యశ్వమునకు నీరుబెట్టి సేదదేర్చి నేనును గాలోచితకరణీయంబుల నిర్వర్తించుకొనుట లెస్సయని నిశ్చ యించి యా వృక్షచ్చాయనుండిలేచి మందగమనంబున నటునిటు దిరుగుచుండ వానికి సమీపముననే జలాశయ మున్నటుల హంసాది జలపతిత్రసందోహకూజిత నిస్వనంబు వినంబడెను. ఇందు కాసారమున్నది రమ్మని సన్నఁజేయుచున్నటుల గాలిచే గదలు చున్న చెట్లకొమ్మలు గనంబడెను. కమలసౌరభంబుతో స్వాగతం బొసంగుచున్న విధంబున నెదురువచ్చు కమ్మగాలులవలన నందు జలాకరంబుండుట నిశ్చయించి యా భూమీశుం డమందానందంబున నా దిక్కునకరిగెను.

ఆ కొండలనడుమ హిమప్రభేదమువలె చందనసంస్కారము లీల చంద్ర పరిణామముగతి శీతకాలసంతానవిధంబున నత్యంతశీలంబై వర్షాగమకోశమువలె సంచి తాంబు సర్వస్వమై, సముద్రరూపాంతరము పోల్కె సుస్వాదుజలమయంబై, వరుణ రాజు చక్రవ్యూహములాగున వివిధోర్మిచమూచలనదుస్తరంబై. మానససరోవరమునకుఁ దోడఁబుట్టువై, మహీమాత్రుకయందలి ఠకారమట్లు వర్తులంబై, నిరాలంబమైయున్న యభ్రగంగ బరువుచేఁ గ్రిందఁబడిన ట్లొక్కచో బుంజీభూతమై, ధర్మము నడంచు గలి కాల మేతెంచుట యెఱింగి‌ యందులకుఁ బ్రతీకార మొనర్ప నేకాంతమునఁజేరి యాలో చించు మందాకినీ నదీత్రయంబు డంబునఁ గుండ్రముగాఁ గలసియున్నదై, సురపతికి ఫణీంద్రునితోఁ గలిగిన వివాదముమూలమునఁ బాతాళమునుండి యూర్ధ్వలోకంబు నకుఁ గొనిపోవ మర్త్యలోకమునకుఁ జేర్పఁబడిన యమృతకుండములాగున నలరారుచు, శైత్యాభిలాషచేఁ బడినట్లు తటతరుచ్ఛాయలు స్పృశించు శీతలతరంగములను, తరంగ సంగతా లంబితంబులగు శాఖాగ్రపల్లవముఖంబుల స్వాదుతాప్రలుబ్దములైనట్లు తీర వృక్షములచే ననవరతంబును ద్రావఁబడు సలిలముగలిగి, క్షారసాగరజలంబులఁ గ్రోలఁ జాలక సుధామధురవారి గ్రహింపఁబడిన యభినవాభ్రపటలంబులవలె విశాలములగు పద్మదళంబులచే నెల్లెడల నావరింపఁబడి వికసించిన తెల్లదామరలందుఁ బ్రతిఫలించి లోనున్న వరుణదేవున కెండ తగులకుండఁ దచ్చైనికులుబట్టిన వెల్లగొడుగులట్లు జెలంగుచుండఁ దీరముననున్న తాళద్రుమంబుల ప్రతిబింబము లయ్యది యమృతకుండ మని భ్రమించి పాతాళమునుండి యేతెంచిన భుజగ వీరులవలెనుండఁ బ్రకాశమానమై యనిలతరలితంబులగు శీకరనికరములచే నిరంతరము చాతకములగు దుర్దినోత్సవ మొన గూర్చుచు నిందిందిరములకు గమలసౌరభసుగంధితంబగు విలాసభవనమై, సుస్వాదు శీతలజలంబున నటవీచరులకు ప్రపాసత్రమై, దుస్తరంబైనను తరంగములచేఁ దరింపఁ బడునదియై, యగాధమైనను జలములకు లబ్దమధ్యమై విమలమైనను నిందీవరప్రభలచే మలినమై, పవిత్రతోయయైనను నరవిందమిధుబిందుమిశ్రితమై, జలదేవతాంజనకూపికల వలె కువలయకళికలంగలిగి, చిందెడిజలమున భూమినెల్లఁ దడుపుచు. నెగురు తరంగ ములవలన దిక్కులాక్రమించుచుఁ బైకిఁ జిలుకు శీకరకదంబకముచే నంతరిక్షమునకు