పుట:కాశీమజిలీకథలు-12.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్ర సమ్మేళనము కథ

229

అంత నొక్కచో ననేక తరుశకుంతకూజితారావతుములంబున దెలివిఁబొంది తా నొక మహారణ్యమధ్యంబునఁ దిరుగుచున్న ట్లెఱింగెను. ఎదుర నెందుఁజూచినను గొండలతో నిండియున్న ప్రదేశమేగాని యామర్కట మందుఁగనంబడదయ్యెను. ఇఁక ముందుఁబోవుట కశక్యమగురీతి నడ్డముగానుండి యగస్థ్యునివలన మోసగింపఁబడుట యెఱింగి రోషమొంది పెరుగుచున్న వింధ్యనగేంద్రములీల దక్షిణ దిక్కునెల్ల నాక్ర మించుకొనియుండి గౌరీతపశ్చరణపంచాగ్నులచే మంచు కరిగిపోయిన హిమాద్రివలె, హరపదస్పర్శాప్రభావంబున స్ఫటికపాండుకుష్టువుం బోఁగొట్టికొనిన కైలాసముగతి, వార్థక్యంబునఁ గాంచ నచ్చనింబాసిన మేరువువిధంబున నొప్పుచు నదభ్రశిఖర కృతా భ్రంబగు నొక్కభూభృద్వరంబును గనుంగొనెను.

అప్పుడు రాజు విస్మయమందుచు సత్వరంబునఁ గళ్ళెమును లాగిపట్టి గుఱ్ఱ మును నిలిపి దాని నవరోహాణం బొనరించి యలసట వాయ ఘనశీతలచ్ఛాయల నొప్పు నొకవృక్షముక్రిందకు జేరెను

339 వ మజిలీ

విచిత్ర సమ్మేళనము

అప్పు డాపుండరీకరాజేంద్రుండు నలువైపులం దిలకించి విభ్రాంతుఁడై యిట్లు చింతించెను. ఆహా ! ఇప్పుడు నే నేమహారణ్యంబునఁ జిక్కుకొనియుంటిని? ‌ బ్రహ్మాండవలక కీలకంబుగ నొప్పుచున్న యీ పర్వతము పేరేమి ? ఈ ప్రదేశమున కేనెట్లు జేరుకొంటిని ? కుమారకేసరి ప్రభృతిసహాయు లేమైరి ? మహాజపంబున నీ తురంగము నన్నెంతదూరము దీసికొనివచ్చినది ? నేను దీని వేగలాఘవంబులనెన్నుచు న న్నేమార్గమున విచ్చటకుఁ దీసికొనివచ్చెనో గమనింపనైతిని. దీనిని బట్టికొన నెంత దూర మేతెంచితినో, యామర్కట మేమైనది ? అదృశ్యభావమ దిన యొకమహాభూత మదికాదుగదా ? మాయావి యొకం డీరూపంబున నన్నిటకు లాగికొనివచ్చెనేమో ? ఇఁకముందు న న్నేమిచేయునో ? ఇందు దైవము కర్మానురూపమగు ఫలమెయ్యది నాకు సమకూర్చునో ? లేకున్న విధి నాకిట్లు ప్రతికూలుఁడై యుండుటెట్లు సంభ వించును ? నే నిప్పు డేమిచేయవలయును ? ఈ తురంగము నధిష్టించి వెనుకకుఁ బోదునా ? ముందున కరుగుదునా ? లేక యిచ్చటనేయుండి మాయమైన యా కోఁతిని వెదకుదునా ? ఈ యుత్తమాశ్వము నిముసములో నన్ను నగరమునకుఁ దిరుగ దోడ్కొనిపోఁగలదు. కాని మహాద్భుత రసాస్పదంబగు నా వాలీముఖంబును దిరుగఁ గావించు యెట్లు ? దగఁగొన్నవారు పరమ ధర్మార్తిభృత్తులను నితాంతసీతలస్వాదు జలంబులుగలిగి, తీరంబుల ఫలవృక్షములతో నొప్పుచుండు జలాశయంబులఁ దరుచుగ నాశ్రయించుచుందురు. కావున నిప్పు డట్టి ప్రదేశంబునకే బోయెదంగాక ! అచ్చట నైన నవ్వనచరంబు గనంబడకుండునా ? మనఃప్రవృత్తియే సంతోషవిషాదంబులఁ