పుట:కాశీమజిలీకథలు-12.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యుండెనేమో ! కానిమ్ము. ఈవానరచేష్టితం బులఁ బరికించి యేమిచేయవలెనో యట్లే యొనరించెదంగాక యని దలంచుచుండ‌ పసంతశీలుఁ డేతెంచి యిట్లనియె.

దేవా ! ఈకోఁతి యెచ్చటనుండివచ్చుచుండెనోగాని ప్రతిదినమిం దేతెంచి మమ్మెవ్వరిని లక్ష్యముసేయక నవపాకమధురంబులగు ఫలంబులేరి కోసికొనిపోవు చుండును. చిత్రమేమన దా నొక్కపండైన దినినట్లు గనంబడదు. ఆఫలంబుల నెచ్చటి కెందులకుఁ గొనిపోవుచుండెనో దీని నెట్లు నిగ్రహింపవలెనో మాకుఁ దెలియకున్నది. నేఁ డేలినవారు స్వయముగా నేతెంచిరి గావున జరిగినదెల్ల మనవి చేసికొంటినని పలుక నతివిస్మయావేశహృదయుఁడై యారాజేంద్రుండు దానిని స్వయముగా నిగ్రహింపఁ బూనెను. అప్పుడు -


గీ. శుభదళాప్రతిముఁడు భూభుజుండు నైన
    నతఁడు రా ధుర్దినమువోలె నాప్లవఁగము
    తరుణరవిక్తముఖముతోఁ దరలిపోయె
    వనమునందుండి ఫలసంపదను హరించి.

గీ. చరణవిన్యాసమున దూఁకు శక్తి దెలియఁ
    బూర్వదేహంబు నిగుడించి ముడుచుకొనుచు
    వడిగ నడచుచు మెడఁ ద్రిప్పు దెడపఁదడప
    నదిగొ యిదిగో యనఁగ మాయమయ్యెఁ గోఁతి.

అయ్యది యుద్యానమును ధ్వంస మొనరించెనను కోపంబును నందలిఫలం బులఁ దానుదినకుండ నేమిటికిఁ గొనిపోవుచుండెనోయను విస్మయంబును బొందుచు నారాజేంద్రుండు కళప్రహరంబున దురంగము నదలించి మహాక్రోధంబున నావాన రము పిరుంద నరిగెను. అతి జవంబునఁ బోవుచున్నదానిని బట్టుకొనుదలంపునఁ గుమారకేసరి ప్రభృతులు దన్ననుసరించి రాజాలక నిలిచియుండ నారాజేంద్రు డే కాకియై యాప్లవంగమువెంట మిగులదూర మరిగెను. అట్లు వాయువు కన్న వేగంబునఁ బోవు ప్లవంగ‌ము ననుసరించి పుండరీకునియశ్వమేఁగుచుండ దానినోటినుండి పడిన నురుగుముద్దలు వెనుకవచ్చు మారుతునకు మార్గముజూపు గుర్తులై యొప్పెను. ఒకదాని కన్న నింకొకటి ముందుండవలెనను స్పర్థచే దుముకుచున్న నగ్రచరణ ద్వంద్వముతో నాయశ్వము మహావేగంబున ముందుకుఁ బోవుచుండెను. ఆ యశ్వగమనవేగంబు నిక్షీంచి రాజు విస్మయమందుచు నౌరా! ఈ హయరత్నము వియత్పధంబున నెగిరి యరుగుచున్నదా యేమి? ఎవఁడయిన నదృశ్యరూపంబున దీనిని పైకెత్తుకొనిపోవు చుండలేదుగదా? ఎవఁడయిన మాయావి దీని నావేశించి యుండి యిట్లు బరువెత్తుచుండె నేమో ! లేకున్న దీని కిట్టివేగమెట్లు గలుగఁ గలదని బహువిద వితర్కవ్యగ్రహృదయం బున ముహూర్తమాత్ర మకృతావధానుఁడై యుండెను.