పుట:కాశీమజిలీకథలు-12.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

227

విలాసత్వరితగమనంబునుగలిగి, సప్తప్రకృతులయందును నుత్కృష్టుతులయందును నుత్కృష్టమగు సత్వప్రకృతిచే నలరారుచున్నది. వీని యదయవలక్షణము లన్నియును శ్రేష్టత్వమునే స్పష్టపరచుచున్నవి. ఇది యుత్తమాశ్వము దేవర యధిరోహింపఁదగి యున్నది. కావున నోదేవా ! నీవత్యంతముదంబున నీయశ్వంబు నధిష్టించి యశ్వశిక్షా నిపుణుండవై గతవిశేషంబుల నడిపింపుమని యాదరంబున మనవిసేయ నారాజేం ద్రుండు సకౌతుకంబున దాని నధిష్టించి వివిధగతుల నడిపింపఁ దొడంగెను.

ఇంతలో నతిరయంబునఁ గరభకుఁడను సేవకుఁడు రోఁజుచు యొడలెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నిట్టూర్పులంబుచ్చుచుఁ బరువెత్తుకొని వచ్చి దేవా! మోసమయ్యెను. మోసమయ్యెను. ఎచ్చటనుండియో యొకదురాత్ముఁ డేతెంచి ధ్వంస మొనరంచు చున్నాఁడు. వానిని గ్రహింప మే మశక్తులమైతిమి ఉద్యానమును రక్షింపుము రక్షింపు మని భయగద్గదస్వరంబునఁ దడఁబడుచుఁ బలికెను. ఆ మాటలకు విస్మయమందుచు నందున్నవారు “ఓరీ! ఎవఁడు వాఁడని రెట్టించి యడుగ భయకంపితుండై “వాఁడు, వాఁడు” అని వచించు సేవకుని మాట లారాజముఖ్యునకు నవ్వుబుట్టించెను.

రాజు వాని పిరికితనంబునకు లోలోన నవ్వుకొనుచు మడమలచే నా తురంగము నదలింది బరువెత్తించి కుమారకేసరి ప్రభృతులు వెంటరా క్షణములో నా ప్రదేశమునుజేరి ముందు నలువంకలఁ బరికించెను. అందొక లతామండపమునుండి యింకొక లతామండపమునకు నొకచెట్టునుండి యింకొక చెట్టుమీఁదకును దుముకుచు, వనపాలుర బెదరింపుల లెక్కగొనక యతివిక్రమంబునఁ బరిభ్రమించుచు, ఱేని చిత్త వికారమును బోఁగొట్టు హాస్యరసంబున కాస్పదంబై దుర్ణయప్రవృత్తయై, వికటస్వ రూపయై చపలస్వభావయై, మాటి మాటికి నొడలు గోకికొనుచు, గోధుమవర్ణముగల త్రాచుబామువలెఁ బృష్టభాగంబున లాంగూలము వ్రేలాడుచుండ, నెఱ్ఱనిముఖమును దీర్ఘదంతములును జూపరులకు భీతిఁగొలుపుచుండ, దంతనిష్కర్షణంబున వనపాలకుల నెకసక్కెములాడుచు నటవీచరవేషముల యందు విదూషకపాత్రమువలె, కాంతార నగరమందలి విటునిలీల, నారామగ్రామఫలంబులకు భోక్త విధంబున నొప్పుచు నత్య ద్బుతమహాకారభాసురమగు నొకవానరశ్రేష్టము గనంబడెను.

దాని నీక్షించి యారాజేంద్రుడు తదీయస్వరూపంబునకువిస్మితుండగుచు, దాని చైతన్యప్రవృత్తి నగ్గించుచు, దానిఫలగ్రహణ సామర్థ్యంబు నెన్నుచు తిర్యగ్జాతి యందు బుట్టినను మనుష్యస్వభావ వ్యాపారంబుల మెలంగుదానిని బొగడుచు ప్లవగ జాతియందుఁ బుట్టినను నట్లు నిర్భయముగా రక్షకభటులనెల్ల మర్దింపఁగలిగిన దాని సామర్ద్యంబు నభివర్ణించుచు, నిట్లు మనంబున వితర్కించుకొనెను. ఔరా! ఎవ్వఁడైన నిజశరీరమును మరుగుపరచి యిట్టిస్వరూపంబున విహరించుటలేదుగదా? రామాయణం బున సుగ్రీవనలనీలోంగద ప్రభృతులు దివ్యాంశజులని విందుము. వారిలో నెవ్వఁడైన నిట్లేతెంచియుండలేదుగదా? లేక మధ్యలోకవర్తియగు నాహనుమంతుఁడే యిందు వచ్చి