పుట:కాశీమజిలీకథలు-12.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఇంతలో నాయశ్వముతోఁ గిరాతరాజు సమీపమున కేతెంచి రాజునకుఁ బ్రణామము లాచరించి యిట్లనియె దేవా! నేఁడు నేను వింధ్యగిరిపరిసరారణ్యంబునఁ దిరుగుచుండ నొకచో నాయెదుట నంబరతలంబునుండి యీయశ్వరాజు మత్యంతహరిత దూర్వాస్తంబంబుపై మోరబై కెత్తుకొనిబడెను. అంబరమ నందలి రవిరథతురంగము సరసదూర్వాహారకాంక్షచే క్షోణీతలంబున కవతరించెనో లేక యీ యద్రిశిఖరమున నమతుఁ డెవ్వఁడై న విహరించుచుండ వాని వాహనము బ్రమాదమునఁ గ్రిందఁబడెనో నే నెఱుంగను. కాని దాని యద్బుతసుందరాకారమును దిలకించి విస్మయపడుచు నేనిట్లు తలంచుకొంటిని. ఆహా ! అసదృశాకారముననొప్పు నీయశ్వ మెవ్వరిదై యుండును? ఎచ్చటనుండి వచ్చినది? రవిరధతురంగమస ప్తముకన్న మిన్నగ దీనిని విధాత నిర్మించి యుండవచ్చును. సముద్రగర్భమునుండి వెల్వడిన యుచ్చైశ్రవంబు దీని నీక్షించి సిగ్గు పడుటచేతనే దానికి పుడమినుండుభాగ్యము లేకపోయెను. ఇట్టి వాహనరత్నమును బరిత్యజించి హరిణమునెక్కి దిరుగుటచేతనే సమీరణునకుఁ జంచలుఁడని లోకంబునఁ బ్రతీతిగల్గెను. దేవతలగుఱ్ఱముకన్న నుత్కృష్టాకారమున నొప్పు నీయశ్వము నధిరో హించుటకు మనుష్యమాత్రుం డర్హుండు గానేరఁడు. అధిష్టించినను నడిపింపనోఁడు. కావున దీనిని నతలోక దేవేంద్రుండవగు నీకుఁ గానుకగా సమర్పింపఁదలంచి యశ్వ శిక్షానిపుణుండగు దారకునిచే దీనిని బట్టించి జీనుమొదలగు పరికరంబుల నాయత్తపరి పించి దేవరసమక్షమునకుఁ దోడ్కొని‌వచ్చితిని. పిమ్మట దేవరయే ప్రమాణమని యూరకుండెను.

అప్పుడు కుమారకేసరి “ఆహా రాజేంద్రుని మనంబును రసాంతరంబునకు ద్రిప్పుటకు మంచియుపాయమే దొరకెను. ఈ యశ్వము నెపంబున వీని విరహావర్దను మరపించెదంగాకయని దలంచి యీయశ్వము సర్వాంగములఁ బరీక్షించి రాజేంద్రున కిట్లనియె. స్వామీ ! అవధారు అశ్వజాతులు తొమ్మిదింటియందును నుత్తమంబగు “తో కోరా” జాతియం దియ్యది సంభవించినది. శ్రేష్టంబులగు నశ్వలక్షణంబు చెనమి దింటిని దాల్చియున్నది. ఎత్తు పొడవు లావు యెన్నియంగుళము లుండవలెనో‌ యట్టి పరిమాణము గలిగియుండుటచే నతియుత్కృష్టమైనది. చెవులు శాస్త్రమందుఁ జెప్పఁ బడినట్లు లఘువులై శ్రేషత్వముకు దెల్పుచున్నవి. కేసరత్వక్తనూరుహంబు లెట్లు మృదువుగానున్నవో దిలకింపుము. జానుజంఘాననంబులు బుష్టిలేకయుండుట పరికిం పుము. నయనదళనస్తంబులు స్నిగ్ధములై యుండెను. మెడ నిడుపైనది. డెక్కలు గఠినములై యున్నవి. లలాటకటిస్కంధపుష్టాక్ష వక్షస్థలంబులు విశాలంబులై యున్నవి. వర్ణచతుష్టయంబులో ముఖ్యమైన పాటలవర్ణంబు గలగియున్నది. ఎచ్చట శుభావర్తము యుండవలెనో యచ్చటనే యవి చిహ్నితములై యుండెను. శంఖధ్వనిఁబోలు షేషారవం బునఁ జెలఁగియున్నది. దివసత్వంబును, నగ్నిచ్చాయమును బంకజసౌరధంబును,