పుట:కాశీమజిలీకథలు-12.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    యత వక్షోజముఖాదిసంపదలచే నాతిథ్యమున్‌ బొంది యం
    చితలీలన్‌ సుఖియించుచుండ నింక హానింగాంచు టెట్లొప్పెడిన్‌.

గీ. అట్లు చిరకాల మాకోమలాంగియందుఁ
   దవిలి సుఖియించు నాదు చిత్తంబదెల్లఁ
   దద్వశంబయ్యె నింకెట్లు తరలఁగలదు ?
   ఉవిద విడనాడివచ్చుట‌ యొదవుటెట్లు ?

కావున

గీ. అరయ బ్రహ్మండమను వార్ధి నధిమధింప
   గలుగు శ్రీదేవివోలె నాకలికిమిన్నఁ
   బడిసి యురమందుదాల్చి నే వసుధయందు
   నచ్యుతుఁడనై చెలంగెడ నహరహంబు.

మఱియు నాదృష్టి యనంగతాప దుస్థితింబడు విరహిణివిధంబునఁ జరణ పల్ల వాస్తరణంబున నెప్పుడు పొర్లాడును ? ఎప్పుడు చిగిర్చిన లతవలె జంఘోరు దండము నూతగొని మహానందంబునఁ బ్రసరించును ? విలాసవతియగు వేశ్యలాగున నెప్పుడు జఘనాంగణంబున నిలచియుండును ? భయాకులయైన భుజగిపోల్కె నాభీ రంధ్రంబున నెప్పుడు బ్రవేశించును? విస్మయప్రచారంబున నలసటంబడిన పడతిగతి నెపుడు త్రివళిమండపము నాశ్రయించి యుండును ? యౌవనవిడంవితయగు స్వైరిణి లీలఁ గురులాంధకారంబున నెపుడు సంచరించును ? రాగిణియను సిందూర లేఖచాడ్పున సీమంతసీమ నెపుడుజేరును ? హర్షోద్రేకంబునఁ ద్రుళ్ళిపడు శహాచందమున నెపుడు లావణ్యపయోధి నెల్లెడల విహరించును ? హృదయమునకు సుఖమొనఁగూర్చు నామె మంజులాలాపములు మదీయకర్ణ వివరంబున నెన్నదఁబడును ? పర్యంత తీక్ష్ణ‌మగు తూలికకరణి నామెదృష్టి యెప్పుడు నాయంగభిత్తికపైఁ బరిభ్రమించును? కళ్యాణవతి యగు నామెనిధానకలశముభాతి మత్కర మందెపుడుబడును? రత్నమాలపోలిక నవరుచిస్థానమగు మదీయకంఠము నెన్నఁ డామె యాలింగన మొనర్చుకొనును? అని యీ రీతి ననేక విధంబులఁ దద్రూపభావనా విశేషంబున ననుక్షణము హృదయంబునఁ బుట్టు కోర్కెలచేత విశ్రాంతి నెఱుంగక మన్మధపరితాపంబున నాఁడు గడపెను.

338 వ మజిలీ

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ గృపావతియను విశ్వభూతి శిష్యురాలు రాజుసమక్షమున కేతెంచి జయజయధ్వానంబున వాని నాశీర్వదించుచుఁ బద్మదామం బుపాయనముగ నొసంగి యుచిత గౌరవమంది రాజున కిట్లనియె. రాజచూడామణీ ! నీవు మఠమునఁ దారావళిని విడచివచ్చినపిమ్మట మా నిర్బంధంబున నామె యాహ్ని విధుల నెట్లో నిర్వర్తించి యుదయసుందరికొఱకు బెంగఁగొని సంతతము గన్నీరు