పుట:కాశీమజిలీకథలు-12.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

219

ప్రసంగమునఁ బ్రొద్దుపుచ్చఁగలదని వచించి లోనికఱిగెను. పిమ్మట రాజేంద్రుండు తారావళితో సగౌరవంబుగ రాత్రి సుఖముగా నిద్రించితివాయని ప్రశ్నించుచు గను సన్న నామెకుఁ గుమార కేసరిం జూపి భగవతీ ! ఈతఁ డెవ్వఁడో జ్ఞాపకమున్నదా? యని యడుగుటయును నామె వానింజూచి మందహాసభాసురముఖారవిందయై దేవా ! ఎఱుంగుదును. సముద్రాంతరమందలి శంకరాలయమున మా యుదయసుందరికిప్రాణ ప్రదంబైన చిత్రపటముతో శాపోపహతుండైన మహాత్ముఁడే యీతఁడు ఈతఁడెప్పగిది స్వస్వరూపమునుబొంది మిమ్ముగలసికొనఁ గల్గెనోయెఱుంగఁ గుతూహలపడుచుంటినని పలుక నా రాజేంద్రుఁ డావృత్తాంతమెల్ల నామూలచూడముగా నామెకుఁ దెలిపి తాంబూలకరండ వాహిని చేతియందున్న యాచిత్రపటమును స్వయముగాఁ గైకొని తారావళి కందిచ్చెను.

చిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూపమును జూచినతోడనే తారా వళి విరహవ్వధాగాఢపీడనంబున నంతఃకరుణయంత్రమునుండి వెల్వడుచున్నట్లునయన ద్రోణులనుండి బాష్పధారలు గారుచుండ జాలిమొదవురీతి హా ! ప్రియసఖీ! యుదయ సుందరీ ! చిరకాలమునకు నిన్ను జిత్రముననైనఁ జూడఁగల్గితిని. అభీష్టజనుల నెల్ల విడిచి నీ వెచ్చట కాలముగడుపుకొనుచుంటి వని విషాదమేదుర హృదయారవిందయై మైమరచి చేతనున్నపటమును జారవిడచి కరయుగంబు ఫాలతలంబునఁ జేర్చుకొని మోమువంచి కన్నీరు కాల్వలై పారఁ బెద్దయెలుంగునఁ రోదనం బొనర్పసాగెను.

అట్లు రోదనంబొనర్చుచున్న యామెంగాంచి యా రాజమార్తాండుండు మారాడఁజాలక కరుణాకటాక్షములఁ గుమారకేసరిపైఁ బరగించుటయును నతం డేలిక యభిప్రాయమెఱింగి తారావళి నిట్లని‌ యూరడింపఁదొడంగెను. భగవతీ ! అభీష్టవస్తు వియోగంబున హృదయవిదారకంబుగ విలపింపని ప్రాణి యెందును నుండడుగదా ! అందును స్త్రీలు దుఃఖమాపుకొనఁజాలరు. ధీమంతులు జిత్తమును స్వాయత్తముగ నొనర్చుకొనవలెను. విధినియోగంబున నెప్పుడేది సంభవించినను దానినెల్ల నోర్పున ననుభవించుటయు కర్తవ్యము. సర్వతత్వవిశేషంబుల నెఱింగిన నీకు నే నేమని యుప దేశింపఁగలను ! నీ హృదయంబును బాధించు ప్రేమబంధమును ద్రెంపివేయుము. ఉదయసుందరి నేరీతిఁ గనుంగొనవచ్చునో యాలోచించి యట్టి ప్రయత్న మొనరించు టయే యిప్పుడు జేయవలసిన కృత్యమని కుమారకేసరి బోధించుచున్నసమయంబున విశ్వభూతి తారావళి యాక్రందనము విని యం దేతెంచి సాదరవాక్యంబుల నామె నోదార్చెను. వారి యనునయవాక్యంబుల సేదదేరి తారావళి విశ్వభూతి యొసంగిన గమండలూదకముచే ముఖకమలసమ్మార్జనం బొనర్చుకొని యెఱుపెక్కిననాసాపుటంబు లమర నీరెలుంగున నిట్లనియె. రాజచంద్రమా ! నీయంతికమున నా ప్రియసఖిం గాంచక నిముసమైన నేనిందు నివసింపఁ జాలను. ఈ చిత్రపటమును జూచుచున్న