పుట:కాశీమజిలీకథలు-12.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వచించుచు నత్యంత భాసురమదభ్ర దంష్ట్రాకరాళవదనమున నొప్పు నిజభయంకర రాక్షసస్వరూపమును బూని గగనమార్గమున నా వెంటబడెను.

అప్పుడు నేనతి భయమున ముందు బరువెత్తుచు నెట్లో యిచ్చటకు జేరు కొని యిందు గనంబడిన మహాంధకూపము మార్గమున నధోభువనమున కేగు దలం పున దానియందు బడితిని. కాని యా పాపాత్ముండు విలపించుచున్న నన్ను బట్టు కొని ప్రహరింపనెంచి యిష్టదైవమును స్మరించుకొమ్మని పలుకుచుండగనే నా సుకృత విశేషమున మీరేతెంచి మృత్యుముఖకందరమునుండి నన్నుద్ధరించితిరి.

నాప్రియసఖికి బ్రాణప్రియమైన భవదీయాకారము జిత్రపటమునం దీక్షించి నప్పుడు చిత్రకారు డెవడైన దన నైపుణ్యము నిరూపించుట కట్లూహించి చిత్రించి యుండెనా ? లేక తన ప్రభుని యాకృతికి విశేషగుణముల గల్పించి లిఖించియుండెనా? కాక మరొక చిత్రకారునితో బందెము వైచుకొనే యపురూపపురూపమును నిర్మించి యుండెనా ? అటుగాదేని యెవడైన నెవనికొరకైన బుద్ధికుశలత్వము మీర నా క్రియ వ్రాసియుండెనా? యని సందియమందితిని. లావణ్యమున మన్మధునికన్న మిన్నగ జిత్రింపబడిన యే నరేంద్రుని స్వరూపమునుగాంచి విరహాతురయై యుదయసుందరి యట్టి యవస్థపాలైనచో యట్టి స్వరూపము నేడిందు నాకు బ్రత్యక్షమయ్యెను. కాని యా యన్నులమిన్నయెక్కడ నెట్లు కాలము గడుపుకొనుచున్నదో యెరుంగ నైతినని యనుకొని సఖీదుఃఖసంభారమున గన్నులనుండి బాష్పముల విడచితిని.

దేవా ! ఇదియే నా వృత్తాంతము. నీవే నా ప్రాణసఖికి జీవితేశ్వరుండవు. మీ దేశ మెద్దియో చక్రవర్తి లక్షణముల బొల్పొందుచున్న మీకు రాజధానియైన నగ రము పేరెయ్యదియో పుణ్యపురుషుండవగు నీవు జన్మించుటకతన నే కులము బవిత్ర వంత మయ్యెనో, మా యుదయ సుందరీ మదనజ్వరాపహరణ మంత్రంబగు భవదీయ యోగ్య నామధేయ మేమో, యెరుంగ మిగుల గుతూహలపడుచుంటిని. త్రిభువనశ్రీ సర్వమై, మదనుని మొలకయై శంఖపాలకులి జీవితమై యొప్పు నా యనుంగుసఖి యిప్పుడెందున్నదో గదా ? బంగారమందు మాణిక్యవర్తివలె నిన్నెన్న డైన గూడి భాసిల్లగలదా ? భవదీయ విరహదాహార్తదశ నెన్న డైననామె విడచిపెట్టి సుఖించునా ? నాకెన్నటికైన నామెను వెదకుచు దిరుగు కష్టముదీఱునా? యని బలుకుచు భూమీంద్ర నందనుని వదనముఫై జూడ్కులు బఱపుచుమిన్నకుండెను. రాజేంద్రుండు దన కుదయ సుందరీ సంఘటనము దుష్కరమని వాడిన ముఖపద్మమువలన సూచించుచుండ, విశ్వభూతి యేది యెట్లు జరుగనున్నదో యట్లే జరుగగలదని బోధింప దారావళి నచ్చ టనే నిద్రింపవిడచి తాను నిజనివాసమునకు బోయెను.