పుట:కాశీమజిలీకథలు-12.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

215

నీయాపద దేనివలనఁ దీరునని యడుగఁ గళ్యాణీ ! నీవలననే నాబాధ తొలగఁగలదని వచించెను. అప్పుడు నే నోహో ! నే నొనర్పఁ దగిన దేమో సత్వరమ జెప్పు మందు లకుఁ దగిన ప్రతీకార మొనర్చి నీబాధఁ దీర్చెదనని పలుక వాఁడు సంతోషస్వాంతుడై యిట్లనియె. సుందరీమణీ ? నా బాధఁ దీర్చెదనని నీవు ప్రతిజ్ఞ జేసితివి గావునఁ జెప్పెద వినుము, వికసితానేక నవలతావిరళ పరిమళ మిళితమై మనోజ్ఞమగు నీ ప్రదే శమున సదృష్టశరీరహతకుని నుండి యేతెంచిన పుష్పశిలీముఖ సహస్రముల వలన నాడెందము పగులుచున్నది. కరుణా తరంగితాంతరంగవై రక్షింప నీవె సమర్దురాల వని పలికెను.

ఆ పలుకులు ములుకులవలెఁ జెవులకు సోక, ఛీ ! అనంగశర పీడితుండగు నీ దురాత్ముని మాటల వలన నిష్కారణమ మోసపోతిని. బ్రాహ్మణుఁ డెవఁడైనఁ దపస్వినులం జూచి యిట్లు మదనమోహితుండగునా ? వీఁడు నిక్కముగ బ్రాహ్మణా కృతినున్న యొక తుచ్చుండు. నే నిప్పుడేమి చేయఁదగును ? కానిమ్ము. వీ డొనర్చిన మాయకుఁ బ్రతిగ మాయయే ప్రయోగించి యవ్వలకుఁ బోయెదంగాక యని మదిలోఁ దలంచి నాపైనున్న వల్కలంబునఁ గొంత విడఁజింపి మహానుభావా ! దీనిం గైకొని మీఁద గప్పికొనుము. అట్లొనర్చితివేని దళసరిగానున్న యీ వల్కలఖండము నీకుఁ గవచప్రాయమై కట్టెదుటి విటపికుసుమ మందలి శిలీముఖమె కాకుండ నీవనకుసుమకుటీ రముల నివసించియున్న మధువ్రతనితతి నెల్ల నిన్నంటకుండిఁ జేయఁగలదు. పుష్ప శిలీముఖ బాధనుండి నిన్ను రక్షించుటకు నాకుఁ దోచిన యుపాయ మయ్యదియ నీ మాటల విని నే నొనర్చిన ప్రతిజ్ఞ నిట్లు నెరవేర్చుకొంటిని. తథ్యవచననై నాదారిని నేను పోవుచున్నానని పలికి యీవల్కలశకలము వానిఫైఁ బడవైచి వాఁడెవఁడో నేనొన ర్చిన దానికిఁ గోపించి నాకేమి కీడు సేయఁ దలంచునో యను భయంబెన వేధించు చుండ నతిరయంబున నంబరంబున కెగిరి పోవుచుంటిని.

వాడును నిజాభిప్రాయవిరుద్ధముగ నట్లు జరుగుటకు పూత్కార మొన ర్చుచు నేను ప్రతిన నెరవేర్చుకోగలిగితినో నా మాటల ధోరణి నెరింగి మహాక్రోధ మున మండిపడుచు నోసీ ! పాషండినీ మృషాపాండిత్యలవదుర్విదగ్ధా ! పుష్పశిలీసుఖ శబ్దమునకు బుష్పశరుడగు మనోభవుండును నర్ధముండగా పుష్పమందలి శిలీముఖ మగు భ్రమరమని శ్లిష్టార్ధవ్యాఖ్యాన మొనరించి నన్ను వంచించి పోవజూచుచుంటివా ? ఎందు బోగలవు ? యిప్పుడు నన్ను జూడుము. బలాత్కారముగ నిన్ను బరి గ్రహించెదను. అప్పుడైన నన్నంగీకరింపకుందునా ? అంగీకరింపకున్న నృశింహ ఖర ఖర తీవ్రంబగు కృపాణమున నీ కుత్తుక నుత్తరించి వై చెదనని నిష్టురముగ