పుట:కాశీమజిలీకథలు-12.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


గీ. రాముఁడు మురారి నిజము సుర ప్రవరులు
    కపిభటుల, నాదు దోర్బలగరిమ సురలు
    బందెఁ బడలేదే ? మురవైరి యందులేఁడె ?
    భయ మికేటికి నాబహిఃప్రాణథనమ !

మఱొక్కచోట రావణవధానంతరము వాని నుద్దేశించి కొందరు సుర ద్వేషులు పలికిన విచారభాషణముల నింకొకచిలుక యిట్లు పఠించుచుండెను.


ఉ. హా ! దశకంఠ హా ! ప్రభువ ! హా ! సురశాసక ! హా ! మహోగ్రకా
    ర్యాదర ! యెందునుంటివొగదా ? నినుఁబాసిన యిప్పురంబు మ
    ర్యాదలఁ జూడు నీదుభవనాంగణఘృష్ణులనైనఁ ద్రొక్కగా
    రాదను దివ్యు లిందిపుడు ప్రస్తుతిగాంతురు పూజ్యులైసదా.

వేఱొక్కచోట శూన్యాయతన మండప గర్భమందు విశ్రాంతికై చేరిన వై దేశికనిశాచనులు రావణవధావిధానమందలి విధివైపరీత్య వృత్తాంతమును విచారభావ మునఁ జెప్పుకొనుచుండ నిట్లు వింటిని.


గీ. సేవకులుగా మెలంగిన దేవసంఘ
   మమర వానరజాతియం దధిభవించి
   కడక దశకంఠుఁ బొరిఁగొనఁ గలుగు డహహ !
   దైవవైపరీత్యమునఁగదా ! తలంప.

ఇట్లు లంకాపురమున రామరావణ మహాసంగ్రామ సంబంధమగు వృత్తాంత మనేకవిధముల నెరుంగుచు నందందుఁ దిరుగుచుంటిని. అపూర్వ తపస్విని యేతెంచె నని నాచుట్టును మూగు వృద్ధసమూహము మూలముననైన నుదయసుందరి వార్తఁ దెలిసి కొనవచ్చునను నాసతో నానగరమందు లోపలను, వెలుపలను, మూలమూలఁ బరి భ్రమించి యెందును నామెసడిఁ దెలిసికొనఁజాలక నిరాశఁ జేసికొంటిని. ఇంతలో యువతీరత్నాపహరణంబున బ్రసిద్ధికెక్కిన విద్యాధర కుమారుల మాట జ్ఞప్తికి వచ్చు టయును వారికిఁ క్రీడాస్పదంబులగు మలయాది గిరిగహ్వరములయం దామెజాడఁ దెలిసికొనవచ్చునని దలంచి యందుఁ బోవ గగనంబున కెగిరి యతిజవమున నరుగు చుంటిని.

336 వ మజిలీ

ఇట్లేఁగుచుండ నొకచోఁ బ్రాంతగిరి గహ్వరమునందు రక్షింపుము రక్షింపు మని పూత్కారపూర్వకముగ నాక్రోశించు బ్రాహ్మణరూపధరుండగు నా నిశాచరాప సదునిఁ గనుంగొంటిని. అయ్యో ! బ్రాహ్మణుండాపన్నుఁడై యున్నాఁడని దలంచి జాలిఁగొని ససంభ్రమంబునఁ జేరువకుఁ బోయి సాదరవాక్యముల నోబ్రాహ్మణుఁడా !