పుట:కాశీమజిలీకథలు-12.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

213

వహించి యందు జరించెదంగాక యని నిశ్చయించి యప్పుడే యట్టివేషమును దాల్చి విమానమువలె నభమున నతిజవమున గొనిపో దగిన పాదుకల సంపాదించి వానిం దొడిగికొని నిర్గమించి లంకాపురమున కేగితిని. పూర్వము శ్రీరామునిచే బరిగృహీతమైన రణాధ్వరకుండమున బ్రజ్వరిల్లు ప్రతాపానలజ్వాలలవలె ప్రకాశించుచున్న కనకమయా శేష దివ్యమందిరాగార ప్రాకారద్యుతికలాపముల దూరము నుండియే తిలకించితిని, పిమ్మట నుదయసుందరిని వెదకుటకు నగరపరిసరమునకరిగియందు సీతామహాదేవి నివసించుటచే బవిత్రవంతమై శింశుపాతరువుమూలమున బ్రసిద్ధికెక్కి రావణనిర్మిత మగు నుద్యానమున బ్రవేశించితిని.

తొల్లిబందిగమందుంపబడిన సీతనేత్రములనుండి యజస్రముస్రవించిన కాటుకకంటిధారలచే మలినమగుటవలన భూదేవి కూతున కబ్చిన కష్టములుగాంచి దుఃఖాతిదాహదగ్ధయైనట్లు శ్యామలత్వమును వహించియున్న శింశుపావృక్షచ్ఛాయలం దిలకించితిని. కుపితుడగు హనుమంతుని కరతలచ పేటాస్ఫాలనమున విదళితుండెన యక్షయకుమారుని వధ్యస్థానమందలి రక్తపాతమ లీల గైరిక రాగముచే నెఱ్ఱనైన క్రీడా గిరిపరిసరమును జూచితిని.

అచ్చటకు సమీపమున నక్షవధాస్వాదలుబ్ధుడగు హనుమంతునిచే జంప బడిన జంబుమాల్యాది రాక్షససేనలయస్థిముకురములవలె దెల్ల నైన ఱాళ్ళచేజుట్టును నరు గులుగట్టబడిన వృక్షములు గాంచితిని. మారుతిని బంధింపవిడువబడిన పరుషపాళోరగ గరశానల శిఖలవలన దహింపబడుటచే తృణవిటపిశూన్యమైన యింద్రజిత్తుయుద్ధ భూమిని గనుంగొంటిని. ఉదయసుందరిని వెదకుచు నే నాయారామమున దిరుగుచుండ రామలక్ష్మణ భుజాస్త్రధారా వకర్తనోచ్చలిత మౌళివలయులగు మేఘనాధప్రభృతి రాక్షసవీరుల పాదఘట్టనములవలనను, దత్కబంధ తాండవమువలనను సమతలంబైన ప్రదేశములు గొంచె మచ్చటచ్చట గోచరించుచుండెను.

మరియును దాశరధి కరళరాఘాతవిఘటితాయుష్యుండగు కుంభకర్ణుని కులాచలసన్నిభంబగు కళేబరము బడుటచే దృటితమై త్రికూటగిరిశిఖరశిలాఖండము పడుటవలన బలమైన ప్రదేశము వీక్షించితిని. అతికుతూహలమున నంబరమందు గూడి యున్న సురశిబిరము కరములనుండి యెడతెగక పడిన పారిజాతకుసుమ సముదాయా మోదమున నిప్పటికిని బరిమళించుచున్న రామరావణసంగ్రామ స్థలమును గనుం గొంటిని. పిదప దశకంఠుని రాజధానిం జొచ్చితిని. అందొకచోట సంగ్రామవృత్తాంత మెరిగి భయచకితురాలైన మండోదరి నూఱడింప బలికిన రావణునిమాటలను నేర్చు కొని యొకపంజరమందున్న చిలుక యిట్లు పఠించుచుండెను.