పుట:కాశీమజిలీకథలు-12.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

డత్యంతచింతాకులస్వాంతుడై నలుగెలంకుల నామె నరయుటకుఁ బరిజనుల బుత్తెంచెను. వారారాజపుత్రిక నరయఁ బ్రతిగృహంబునకుఁ, బ్రతిదేవాలయమునకుఁ, బ్రతిసత్రము నకుఁ, బ్రతి కరితురఁగశాలకుఁ, బ్రతికర్మవిద్యాదిస్థానమునకు, బ్రతివనంబునకుఁ, బ్రతి జలాశయంబునకు నత్యంతవేగంబునఁ బోయి యందందు వెదకుచుండ నా రాజధాని యెల్ల క్షణములో వ్యాకులీభూతమయ్యెను.


గీ. వాద్యములు గీతములు మంగళోద్యమములు
    గలకలలు లేక పురమెల్లఁ గానుపించె
    సరసపాత్రప్రవేశ మాసన్నమైన
    రమ్యరంగస్థలంబు గరంబుబోలి

గీ. అప్పుడాహారవస్త్రంబు లానృపాల
    యమున నొకఁడైనఁ బడయలే దనగవచ్చు
    సిరినిఁ బాసినరీతి నాచెలువ విడచి
    దుస్థితినిఁ బొందె జనమెల్ల దుఃఖమునను.

ఇట్టి ప్రవృత్తియందున్న సమయమున నామెను వెదుకబోయిన పరిజనులెల్ల విఫలప్రయత్నులై వచ్చియుండుట యెరింగి దఃఖించుచున్న ఱేనితో మంత్రిసత్తముం డిట్లనియె.

ఆర్యా ! దఖింపకుము. సంసారరీతు లతివిచిత్రములు, వాంఛితములు వ్యవసాయసాధ్యములు, కార్యములు, ప్రజ్ఞానుబంధసిద్దములు. పౌరుషంబున బడయ రాని దెద్దియు లేదు. బుద్ధిబల మసాధ్యముల‌ గూడ సాధింపగలదు. హృదయస్థయిర్య మున దుర్దర్శనంబులనైన గనుంగొన వచ్చును. మనంబున కెందును జొఱరాని చోట్లు లేవు. అని తత్కాలోచిత భాషణముల నిదర్శనపూర్వకముగ వచించుచు ముందొనర్ప దగిన కృత్యముల నెరింగించుచు నా ఱేనిమనంబున కించుక యుపశాంతి గలిగించెను.

పిమ్మట శిఖండతిలకుండు మంత్రిసత్తముని యుపదేశానుసరణి నభీష్టసిద్ధికై కులవృద్దులచే దేవతాపూజలు చేయించుచు, నిమిత్తిజ్ఞులవలన నిమిత్తముల నెరుంగుచు, శాకునికులమూలమున శకునముల దెలిసికొనుచు, విదేశస్థులఁ ప్రశ్నింపఁ బరిజనుల నియోగించి విరోధినిలయంబులఁ బరీక్షింపఁ బ్రణిధివర్గము నియమించి, మిత్రస్థాన ములఁ బ్రస్తాపింప దూతలం బుచ్చి, త్రిభువనంబుల నెల్లెడలఁ బరిశీలింపఁజేయనెంచి నా తండ్రితో నిట్లనియె సైన్యాదినాయకా ! రత్నమౌళీ ! సకల భువన ప్రచార సమర్దు లగు పన్నగభటులచే సర్వలోకముల యందు నెందును విడువకుండ మదీయాన్వయైక జీవితమును వెదకింపు మని పుత్రికా వియోగవిధురిత చేతస్కుఁడై పలుకు రాజునకు మనఃప్రియంబు గలుగులాగున నా తండ్రి యిట్లనియె.