పుట:కాశీమజిలీకథలు-12.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

209

నిద్రించుచున్న యీమెంగాంచి లక్ష్మియనుకొని అయ్యో! నాపట్టికెట్టి యిక్కట్టు సంభవించెనని జాలింగొని సముద్రుం డీమెను నిజనివాసమునకు దోడ్కొని పోయి యండడుగదా ! తన మనోనాయకుని నెందైన వెదుకనెంచి యుత్పన్నానేక సంకల్పయై యీమె యెచ్చటికైన దూరముగా బోయెనేమో? లేక తాను కోరిన పురు షుండు కలలో గాకుండ నెదుటకు వచ్చి ప్రణయకోపమున వెడలిపోవ వానియందలి యనురాగమున వెనువెంట నెచ్చటికైన నీమెపోయి యుండునా? అట్లుగాకున్న ననంగ తాపములు సహింపజాలక నెందైన జలాశయమున బడి యాత్మహత్య జేసికొనలేదు గదా? లేక ప్రాణముల నెడబాయ నెచ్చటనైన నొకవృక్షశాఖయందురిబోసికొని యసు విసర్జనం బొనర్చుకొనెనేమో?


చ. వదనక ళైక మత్సరవిపక్షుఁడు చంద్రుఁడు మ్రుచ్చులించెనో ?
    తదమలదంతచంద్రికలఁ దారలు గోరి హరించియుండెనో ?
    మదవతి కేశపాశతిమిరంబున లోఁ గొనెనో తమ్మిస్ర, యే
    మొదవెనె ! బైట శయ్యపయి నున్నకతంబున నీకృశాంగికిన్‌.

అటులఁ గాదేని -

గీ. ఇందుకిరణాంచలముల దీపించు ప్రబల
    మదనదావాగ్నిఁ దరుణి భస్మంబుగాఁగ
    దానిఁ గాసారశీతవాతంబు దాల్చి
    దూరముగఁ జిమ్మియుండు నస్తోకగతిని.

ఆమెజాడ యిందెచ్చటను గనుపింపదు, అత్యంతనిపుణ మగు నూహా ప్రపంచమందెందును నామె యునికి గోచరింపదయ్యెను. నా ప్రియసఖి లేకుండ నామె తల్లిదండ్రులయెదుటి కేమొగము బెట్టుకొని పోదును? ఉదయసుందరి యెచ్చటను గను పిం‌పలేదని యెట్లువారితో వచింతును ? ఆమాట విన్నతోడనే దుఃఖాపన్నములగు వారి ముఖముల నేనెట్లు వీక్షింపగలను? తల్లి విజయలేఖ పరిదేవనము విని నే నెట్లు ప్రాణ ముల నిల్పుకొనగలను? ఉదయసుందరి‌ కేదిగతియయ్యెనో నాకును నదియేయగుగాక? ఈవృత్తాంతమెల్ల విజయరేఖకు నాసఖి కాళిందిమూలమున నెరింగించినమీదట నేమి జరుగునో ప్రచ్ఛన్నముగ నుండి తెలిసికొని పిదప నెచ్చటికైన బోయెదను. తద నంతరమేది యుచితమో దానిం జేసెదనని నిశ్చయించుకొని యట్లొనరించి యూరి బయటనున్న చండీశుని జీర్ణాయతనమునకుం బోయి యందు వేచియుంటిని.

పిమ్మట కాళిందినీమూలమున దుఃఖవార్త నెరింగినతోడనే శిఖండతిలకుం