పుట:కాశీమజిలీకథలు-12.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

పటమును నెడబాసిన యా బాలిక మిగుల పరితాప మందుచు జీవితమునం దాశ లేనట్లు మోము వంచుకొని త్వరితగమనమున నాశలడుగంట యెరిగినదారియైనను వడుగడుగు నకు నేనుదారి జూపించుచుండ నిజభవనమున కేతెంచెను.

పిమ్మట పరిజనుల నెల్లర విడచి నన్నుగూడ సంభావింపక భవనాభ్యంత రమున కరిగి తల్పమున శయనించెను. ఉదయమున నే ననేక విధముల బ్రబోధించు చుండ నెట్లో ప్రాతఃకృత్యముల నిర్వర్తించెను. అప్పటినుండియును నామె సూర్య మండలముచే బ్రకాశమానమగు బగళు బంగారపుంజమును వహించినట్లు శరీరమును దహించుచున్నవనియును జంద్రబింబముతో వన్నెకెక్కు రాత్రులు దృషద్గోళమును దాల్చినట్లు హృదయమును బాధించుచున్నవనియును దలంచుచు నెట్లో కాలము గడపు చుండెను.

అంత వానకారు గడచి బంధుజీవప్రబోధినియగు శరత్సమయ మేతెంచుట యును నదివలెనే యామె కృశింపసాగెను. మయూర జాతివలె హీనస్వరమయ్యెను. మేఘసంపదవలె వెల్లదనముబూనెను. సూర్యునిమూర్తివలె నత్యధికమగుతాపమును వహించెను. కుసుమ శర విసరాఘాతమున, నపరిమితతాపమున బడియున్న యా యన్నులమిన్న కెన్నివిధముల శిశిరోపచారము లొనరించుచున్నను శాంతి గలుగ దయ్యెను.

ఇట్లు మదనునిబారిం జిక్కి యామె పండువెన్నెలచే హృదయాహ్లాదకరమై, కైరవవనమునుండి ప్రసరించు శీతవాతముచే మనోహరమైన యొకనాటిరాత్రియందు సౌధశిఖరమున మంచు పడకుండ తామరబాకులతో గూర్పబడిన విశాలమగు పందిరి క్రింద హంసతూలికాతల్పమున శయనించినది ఉదయమున లేచిన పరిజను లందు రాజ పుత్రిక కనంబడుటలేదని తొందరపడుచుండ నేనును మేల్కొని తొట్రుపడుచు యా మేడమీదను, క్రిందిభాగమునను, బ్రక్కగదులయందును బరికించి యామెయెందులకైన నూతనగృహమునకేగినదేమోయని యచ్చటను, దరుచు దిరుగుచుండుచోటులను, క్రీడా స్థలములయందును నెంత వెదకినను నామె జాడ గనబడలేదు. ఆమె నెడబాయుటకు నేను మిగుల వగచుచు నిట్లని చింతించితిని.

ఔరా! నన్ను విడిచి యెన్నడు నెచ్చటికిని బోవని రాజపుత్రిక నే డెందేగి యుండును? బయట నిద్రించియున్న యామె త్రిభువనమోహనాకారమును గాంచి మోహించి యెవ్వడైన నభశ్చరుం డీమె నపహరించుకొని పోలేదుగదా? అత్యంతాద్భుత సౌందర్య సారముగల యీమెరూపమువలన దమప్రసిద్ధి కొరంతవడుచున్నదని యెంచి విద్యాధరాంగనలీమె నెందైన మరగుపరచి యుందురా, లేకున్న నెవడు కోరునను భయమున నీమె పాతాళము నుండి తొలగింపబడి యిచ్చట మరుగుపరుపబడెనో యా భుజంగాధిపు డీమెవృత్తాంత మెట్లో తెలిసికొని యీమెను దీసికొనిపోలేదుగదా !