పుట:కాశీమజిలీకథలు-12.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

207

రాంతరమున నున్న దేవాలయమును నెదుట వీక్షించి మణిప్రాకారాంతమున ననేక దివ్యరత్నకాంతులచే దేదీప్యమానముగ నున్న యా యూశ్వరాలయమును ప్రవేశించెను, అందు బ్రతిష్ఠింపబడిన సర్వలోకేశ్వరు నారాధింప నఖిలభువనములనుండి యేతెంచిన పురంధ్రీమణులహమహమికముగ ద్రోపులాడుకొనుచు జేయు వారిపూజలం బడయు చున్న నయ్యంబికానాధుని దర్శించి యా యాదిదేవుని యధావిధిగ విజయరేఖ యర్చించే యుదయసుందరిచేతగూడ పూజానమస్కారముల నిర్వర్తింపించి పిమ్మట నందు నివసించియున్న పారాయణియను తపస్విని సన్నిధికిం దోడ్కొనిపోయి యామెకు నమస్కరింపజేసెను. ఆ తపస్విని దీవనలం బడసిన తనూజతో విజయరేఖ వచ్చిన దారి నిజనివాసమున కేగెను. నాటినుండి యుదయసుందరి ప్రతిదిన మా చంద్ర కళాధరు నారాధించి వచ్చువరకు భుజింప నని నియమము జేసికొని యతి భక్తితో నాదేవు నుపాసించుచుండెను.

మఱొకనాడు నిత్యయాత్రానుక్రమముగ సకలసఖీపరివృతయై యా రమణి యత్యుత్సాహమున నమ్మ హేశ్వరుని బూజింప, నచ్చటి కరిగి పుష్పాచయమునకై యా యాయతనమందున్న బూదోటకు సఖులతో నేగెను. సారంగిక యను ఛత్ర వాహిని సురాలయాంతరమున నొరులు జొఱని చోటి కేగి యందొకమూల వాడుక ప్రకార మా చిత్రపటమును గొడుగున బెట్టి త్వరితగతి నేతెంచి మమ్ము గలసికొనెను.

అట్లు మేమందఱ మతిసంతోషమున బుష్పాపచయం బొనర్చుచుండగా నాదేవాలయమునుండి పారాయణి యుదగ్రకోపమున నోరోరి! మూఢ! శుక్తిభంగ దుష్కృతమున నీపటమును శిఖగా బడసి చిలుకవుగమ్మని యెవనినో శపించు కోలా హలము మాకు వినంబడెను. పట మనుమాట జెవి బడగనే యుదయసుందరి యులికి పడి యం దింకేపటమున్నదని సంశయించుచు కుసుమాపచయము మాని శరవేగమున నట కేగ నేనును నామెతో బోతిని.

ఆ దేవాలయము నొకమూలగా నున్న మండపముమీద నత్తపస్వినియెదుర దన కత్యంతప్రియమైన చిత్తరువును జేత బట్టుకొని శపింపబడిన పురుషుడు నిలువబడి యుండుట యుదయసుందరి తిలకించి అయ్యో ! ఈ యంధకారాతి నారాధించు చున్నందులకు నాకు మంచి ప్రాయశ్చిత్తమే జరిగినది. నిత్యమును మన్మనోహరుని చిత్రపటముననైన దిలకింపకుండ జేసెను గదా ! అని చింతించుచున్నను డెందమున జాలిగొని యా తపస్వినిని బ్రార్ధించి వానికి శాపాంతము గలుగజేసెను.

పిమ్మట దేవుడగు చంద్రచూడుని నిరుత్సాహమున బూజించి యనాదరమున దపస్వినికి నమస్కరించి సలిలసేకములేని మృణాళినివలె, సూర్యుని బాసిన పద్మిని విధమున, జంద్రుని విడచిన కుముదినిగతి, వెన్నెలను వదలిన రాత్రిలీల, యా చిత్ర