పుట:కాశీమజిలీకథలు-12.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

లచే నొప్పుచు, విశాలములగు జలాశయముల బూరించుచున్నను వియోగినీ మాన నాశయముల శోషింపజేయుచు, జగజీవనైక హేతువయ్యును పాంధులకు బ్రాణాంత కారియై మదనమిత్రమైన వర్షకాలమేతెంచెను. అప్పుడు.


చ. ధరణి మనోజ్ఞ కందళ యుతంబు నభం బది మేఘడరంబం
    బరయ నటన్మయూర మధురారవరుద్దము లెల్ల దిక్కులున్‌
    సరసకదంబపుష్పవన సంక్రిమితంబులు శాంతవాతముల్‌.
    దొరఁగు ననంగ రాగజలధుల్‌ జలియింప వియోగిచిత్తముల్‌.

అప్పుడొక్క_ దినమున నామె తల్లి సన్నిధినుంచి శేఖరిక యను బ్రతీహారి సరగున నేతెంచి, భర్తృదారికా ! నీ జనని విజయరేఖ యిచ్చటకు వచ్చుచున్నది. ఎదు రేగి స్వాగతాదివిధుల నెరవేర్పుము. పూర్వము శ్రీదేవి పసితనమున జలధిమధ్యమున నున్న వైకుంఠము వీక్షించి దాని నభిలషింప యామె మరిపెమును దీర్చుటకు జనకుం డగు రత్నాకరుండు సముద్రమధ్యమున దుర్గమాగాధవిభ్రమణముల నడుమ నొకచోట నీటితుంపురులైన దూరమునుండియును స్పృశింప శక్యము గాకుండునటుల దేవతా ప్రభావంబున నసమశిల్పానాభిరామముగ నిర్మింపజేసిన మాణిక్యాయతనం బొండు గలదు. దానియందు జంద్రకేతుడను పేరం బరగు మహేశ్వరుండు బ్రతిష్టింపబడెను. ఆదేవోత్తము నారాధించియే యాశ్రీదేవి యభీష్టసిద్ధిం బడసెను. అట్లేవానిని భక్తితో నర్చించు యువతులకోర్కెలు సిద్ధించునను దలంపుననే సకలభువనవర్తినులగు ముగు దలు హృదయవాంఛితముల బడయుటకు సర్వదా యాదేవు నారాధించుచుందురు. ఈవర్షకాలమున నచ్చట బవిత్రకోత్సవము గొప్పగా జరుగును. ఆయుత్సవమునకు నిన్ను గూడ నేడు తోడ్కొనిపోవ మీతల్లి యిట కేతెంచుచున్నది. కావున కన్యాలంకార యోగ్యములగు భూషణముల దాల్పుము సత్వరమ లెమ్ము సర్వవాంఛితప్రదాతయగు శంకరుని దర్శింపుము. ఆ దేవుడు నీకు బ్రసన్నుడై యభీష్టముల దీర్చునని శేఖరిక పలుక నుదయసుందరి సంతోషముతో రహస్యముగా నాతో నిట్లనియె.

తారావళీ ! అంబ నన్ననుకూలదేవతాసేవకే నియోగించుచున్నది. నాయభీష్ట మును దీర్చువరకు నేనాదేవుని బ్రతిదినము నారాధించుచుందును. వాని యనుగ్రహము గలిగిన నీ చిత్రపటమున నున్న మనోహరుడు నాకు లభింపగలడని పలికి సకలసఖీ పరివారముతో గదలి ద్వారసమీపమున కేగునప్పటికే కుబ్జ వామన కిరాత కంచుకి పురంధ్రి కాప్రాయ పరిజనముతో విజయరేఖ యట కరుదెంచెను.

అప్పుడు కృతప్రణామయగు గూతురి నాలింగనపురస్సరముగ నక్కునం జేర్చుకొని తల్లి ముద్దాడెను పిమ్మట విజయరేఖ యుదయసుందరితో నందుండి వెడలి సముద్రగర్భోపకోణము ననుసరించి వలయాకారముగ మార్గమున నిర్గమించి సాగ