పుట:కాశీమజిలీకథలు-12.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    జలువకై కూర్పబడిన బినవ్రజంబు
    దత్రచిత నూత్నతంతు సంతతుల గాఁగ

గీ. చెలువపైనున్న తృటితరాజీవదళమృ
    ణాళపద్మ సందోహనిర్ణయము గనఁగ
    నంగలావణ్యవారి నీరాకరమున
    మెలఁగు కరిలీల మదనార్తి మెలఁత యొప్పె.

ఇట్లా బాలికాభరణ మదనరస విమోహితయై తదాయత్తమగు చిత్తముతో మేన నేది సోఁకినను ద్వదాలింగనముగ నెంచుచు గనంబడిన దెల్లఁ ద్వదాకారపరిణ తంబుగఁ దిలకించుచు, నెవరేమనుకొన్నను త్వత్కథాప్రసంగమే యని సమీపమున కేఁగుచు, నెచ్చట నేమి చప్పుడైనను వాని మాటల పాటవమే యని చెవియొగ్గి వినుచు, నిట్లు మన్మధతాపమున ధైర్యము చెడియున్న యామెను సంతతము నా యండ జేర్చు కొని శుభనిమిత్తముల దెల్పి దిటవు గరపుచు, సుశకునము లెరింగించి భయము దీర్చుచు, నుపశ్రుతుల నిర్ణయించి యోదార్చుచు, ననేక విధముల, దదీయచిత్తమున కుపశాంతి గల్గించుచు, నా చిత్రపటమునం గల రూపమును ప్రతిపాంధునకు, బ్రతి చిత్రకారునకు, బ్రతి వృద్దునకును జూపించుచు నతండెవ్వరో యెరుంగుదురా యని ప్రశ్నించుచు నుండ గొంతకాలము గడచెను.

ఇట్లుండ నొకనాడు హాటకేశ్వరునిపూజ పాతాళగణుండను నొక వృద్ధ భుజంగతాపసి యట కేతెంచి యా చిత్రపటమున నున్న రూపమును జూచు స్మృతి నభినయించుచు నా ప్రియసఖి కిట్లనియె. పుత్రీ ? వెనుక నొక చైత్రపూర్ణిమయందు దేవునకు విశేషముగ బూజసేయ బ్రహ్మకమలములకై సురలోకమునకేగి యందుండి భూమండలముమీదుగా దిరిగి వచ్చుచుండ నొకానొక పర్వత సమీపమున నశోకవృక్ష చ్చాయ నాసీనుడై యున్న వీనిని జూచియుంటిని. కాని వృద్ధుండ నగుటచే నుత్సా హము లేకపోవుటవలనను బ్రయాణపు తొందరచేతను, వాని వృత్తాంత మరయనైతిని. మృగయాగతుండగు క్షోణీంద్రుడో, స్వైరవిహార మొనరించు విద్యాధరోత్తముడో, లేక పుడమి దిరుగు గుతూహలమున నేతెంచిన దివ్యుడో నే నెరుంగనని చెప్పిపోయెను.

ఆ పలుకు లాలించి మదనశరావిద్దహృదయయై యా యించుబోణి మించిన తమకమున నా పురుషు నెరింగునట్లు, చూచినట్లు సన్నిధి కతం డేతెంచినట్లు తనకను కూలుడైనట్లు దలంచుచు ససంభ్రమమున నాతో నిట్లనియె.


గీ. ఏదియో యొక్క విధమున నితని నన్ను
    గలుపుమా వేగఁ బ్రియసఖీ ! కలుపకున్న
    నిక్కము వచింతు వినుము యింకొక్క గడియ
    యైన మనఁజాల విడతుఁ బ్రాణనిలముల.