పుట:కాశీమజిలీకథలు-12.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

199

అట్టి యనన్యసామాన్య లావణ్యమున నొప్పుచున్న కన్నెమిన్నంగాంచి తజ్జనకుం డొకనా డిట్లని యోచించెను. ఇట్టి మనోహరాకృతి నలరారు యోషామణి యెన్నడైన బాతాళనాయకుండగు వాసుకికంట బడకుండునా? చూచినతోడనే యతండు మదనాతురుండు గాకుండునా? మదనమూఢుడై యీమెను దన కొసంగుమని నన్ను గోరకుండునా? అప్పుడు నేనేమి సేయవలయును? ప్రభునిమనోరధం బీడేర్పకుండుట సమంజసమగునా ? వానికి నాయందు గల సుహృద్భావము నెట్లు గాదనగలను? ఇది యునుంగాక కోరినదానిని లేదను బ్రవృత్తి నాకు గిట్టదు గదా? పోనిమ్మని నాపుత్రి కను వాని కిచ్చుటకు నామనంబొప్పదు. అతం డెంత రసాతల చక్రవర్తియైనను ముల్లోకసుందరియగు నాతనూజాత కనురూప వరుండు గానేరడు. కావున నాపుత్రిక నతండు జూడకుండ నీమె వృత్తాంత మతం డెఱుంగకుండ దగినట్లు జేయుటయే కర్తవ్యమని నిశ్చయించి సముద్రగర్భమందున్న యొక మనోహరమగు నంతర్ద్వీప మున గన్యాంతఃపురముల నిర్మించి యందు వలయు వస్తుసముదాయమెల్ల జేర్చి యనే కుల వృద్ధకంచుకుల నందు గాపుంచి సమవయస్కులగు కన్మకల బలువురతో నా యుదయసుందరి నావివిక్తస్థలమున నివసింపజేసెను.

ఆ శిఖండతిలకున కత్యంత ప్రేమాస్పదుడైన రత్నమౌళియను పద్మకులా భరణునకు వేణీమతియను సహధర్మిణియందు లేక లేక తారావళియను పుత్రికగా నే నుద్భవించితిని. ఉదయ సుందరికి నేను సమానవయస్కనై యామెతో నాహార విహార శయ్యాసనములయందు గలిసిమెలసి ప్రవర్తించుచు దదీయసభీమండలమున కెల్ల దలమానికమనైయుంటిని. నవయౌవనమున జెలంగియున్న కన్నకూతురునకు దగినవరుని సమకూర్ప నాశిఖండతిలకుండు మిక్కిలి తొందరపడుచుండెను. పదునాల్గు లోకములయందున్న రాజకుమారుల మనోహరాకారముల జిత్రపటముల మూలమున దెప్పించి యామెకుబంపి వారివారియుత్కృష్టచరిత్రములెల్ల సఖులచే జెప్పించి యొప్పింపజూచుచుండెను. కాని వారి నెల్లర దృణప్రాయులగా ద్రోసివైచినది. త్రిభు వనవిహార మొనరించు విద్యాధరుల నిరసించినది. దేవతామూర్తులగు మన్మ ధాదులగూడ దిరస్కరించినది. పురుషులరూపమునే చూడరాదని తలంచుకొనినది. అందువలన నామె తల్లిదండ్రులకెంతేని సంతాపము గలిగెను.

అట్లు పురుషదర్శన ద్వేషిణియై యుదయసుందరి మాతో గేవలము విచిత్రపత్రచ్చేదనవిద్యయందును, మనోజ్ఞచిత్రరచనా కౌశలమునందును ననల్పవేణు గానమాధుర్యతరంగములయందును, నమంద కందుకక్రీడావిశేష మందును, నిరంతర లోలావిలాసవైభవంబందును మనోహర శుకపికశారికాది శకుంతసంతాన మంజులాలాప శ్రవణ సంతోషమునందును, ననేకగృహమృగమరాళచంద్రకక్రీడాడంబరము నందును,