పుట:కాశీమజిలీకథలు-12.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలయోగిని కథ

191


333 వ మజిలీ

బాలయోగిని కథ

పిదప మేమిరువురమును లంకాపురమున కేఁగి జరిగిన వృత్తాంతమెల్ల విభీ షణున కెరింగించి కృపాణమును వాని కర్పించితిమి అందుల కారాక్షసేశ్వరుం డానం దమును బొంది యాకృపాణమును నాకుఁ గానుకగా నొసంగెను. దేవర కిప్పుడు నే నొసంగిన మండలాగ్రమదే యని విన్నవించుకొనుచున్నాను. ఈ తపస్విని యెవ్వరో నేనెరుంగను. ఏ కారణముచేతనో మాలంకాపురమునఁ బ్రతిదినము నందందు వల్క లములఁ దాల్చి తిరుగుచు నొకనాఁడు నా కంటఁబడినది. చూచిన మాత్రముననే నేను మదనుని పూములుకులకు గురియైతిని.


గీ. వల్కలపటావగుంఠనాపరత నాత్మ
    వర్షమును గప్పుకొన్న తాపసిని నీమెఁ
    గనఁగ నొరనున్న మదనవీరునికటారి
    చందమునఁదోచె నాదగు డెందమునకు.

మఱియును--

గీ. నడచినప్రయాసవలనఁ జొప్పడిన ఘర్మ
    వారిచే ధౌతమగు నీశరీరయష్టి
    యపుడె నీర్వట్టు వెడలిన యంగజన్ము
    నలినబాణంబువలె వెదనాటె నాకు.

అప్పుడు నేను మకరధ్వజుని తీవ్రబాణముల వేధింపఁబడుచు, మంచిచెడ్డ లెరుంగఁజాలక, ధైర్య మెడల, లజ్జను బరిత్యజించి యా మించుబోణివెంటఁ బోదొడం గితిని నా రాక నెరింగి యాబాల తపస్విని యందుండి పైకెగిరి నిరాలంబమగు నంబ రంబునకుఁ బోయినది. నేనును నుత్పాతవిద్యం బురస్కరించుకొని యామె యొక దివ్యనారీమణి యని తలంచుచుఁ గామగమనంబున నామెవెంట నరిగితిని. ఇట్లు బోవుచు చందనపవనయపరిమళోపగూఢమై గిరినిర్ఝరతుహార నిరాంచితమై యొసఁగు మంద మారుత మొకచో నెమ్మేన సోఁక నసంగతాప మతిశయించుటయును నేనా ప్రదేశమున మాయాద్విజుని రూపమునుబూని యామె ననుసరించి సరసవచనముల వశ్యురాలిగా జేసికొననెంచిన నాయాశయ మెరింగి యాతపస్విని నన్ను విడచి వెండియు మింటి కెగసెను.