పుట:కాశీమజిలీకథలు-12.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అప్పు డంతరిక్షము నుండి బూర్వపరిచితుండగు కపాలభైరవుండను విద్యా ధర కాపాలికుం డేతెంచెను. వానికి నమస్కరించి యా వీరుడు నిజవృత్తాంతమెల్ల నక్కాపాలికుని ప్రశ్నకుత్తరముగా జెప్పెను. మధురాపురపాలకుండగు కళిందకేతుని తనూజుండు కుమారకేసరి యను నతండు ద్యూతవ్యసనపరాయణుండై లంకాపుర మును జయించి విభీషణుని కోశమందలి ప్రభూతకాంచనరాశులం గొనివచ్చుటకు బోవుచున్నాడనుట విని కంకాళకుడు చెప్పిన వృత్తాంత మెల్ల నిక్కమయ్యెనని వాని పరేంగితజ్ఞానమును మెచ్చుకొనుచు వాని నత్యంతము గౌరవించితిని. అప్పుడా పురు షుని విక్రమాతిరేకమునకు దృప్తుడై యక్కాపాలికుండు విజయోగవిద్యాకృష్ణమగు దివ్యకృపాణ మొకటి వాని కొసంగి‌ యంతర్హితుండయ్యెను. పిమ్మట నా రాజపుత్రుం డును ఖడ్గమును గైకొని యా గుడిలోనికి బోయి యందు నిద్రించెను.

అప్పుడు నేనౌరా ! వీఁడు సంగరరంగమున నిక్కముగ నసాధ్యుండు. మీఁదుమిక్కిలి నిరాయుధుండగు వీనికి దివ్యకృపాణము లభించినది. వీని నుపేక్షించిన నిఁక లంకాపురము మాకుఁ దక్కుట కల్ల. కావున వీనియందు మాయాప్రయోగం బొనరింపవలెను. వీడు ద్యూతవ్యసనుఁడు గదా ! మాయాద్యూతమున వీనిని నిర్జిం చెదంగాక యని నిశ్చయించుకొని యందలి వేతాళవర్గమునెల్ల గితవబృందముగా నేర్చరచి ప్రాంగణమండపమున జూదమాడ నారంభింపఁ జేసితిని. ద్యూతరసోల్లోల కోలాహలము వినినతోడనే తదేకపరతంత్ర చిత్తుఁడగు నారాజకుమారుండు గుడిలోనుండి వచ్చి వారితోఁ గలసి యాఖడ్గమును బణమొడ్డుచు జూదమాడఁ దొడంగెను.

నేనేను గంకాళకుని మాయాశక్తిచే విమానముగఁ జేసి దాని నధిష్టించి విహిత విద్యాధరాకృతిం బూని యంతరిక్షము నుండి యవతరించి వారింజేరి యాపురు షునితో నా మాయావిమానమును బణమొడ్డిజూదమాడితిని. నావిమాన మతండు గెలుచు కొనెను. వాని కృపాణమును నేను గెలుచుకొంటిని. వాంఛితార్థసిద్ధిం గాంచి నేనావేతాళ వర్గముతో నదృశ్యుండ నైతిని. అప్పుడా వీరుండు మనుష్యదుర్గభం బగు విమాన లాభమునకు సంతుష్టుండై లంకాపురమున కేఁగ విమాన రూపముననున్న కంకాళకుని మూఁపుమీఁద నుపవిష్టుండయ్యెను. వాఁడును నా యపదేశానుసరణి గగనమున కెగిరి యొకచో గంభీరవారాళిమధ్యమున వానిని బడద్రోసి నిజరూపము దాల్చి నన్నుఁ గలిసికొనెను.