పుట:కాశీమజిలీకథలు-12.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయాబలుని కథ

189

ఆ వృత్తాంత మెల్ల విని రాక్షసేశ్వరుండు శంకాకులస్వాంతుండై చెంత నున్న దనచూపులం బరగించెను‌ వాని యింగితం బెరింగి నేనిట్లంటిని. దేవా! దీనికై మీరింత వలవంత బడ నగత్యములేదు దుర్వార భుజపౌరుషమున బ్రసిద్దికెక్కిన వీరులు బెక్కురు మనయొద్ద గలరు. వారు మేరువునైన ద్రవ్వి తేగలరు. స్వర్లోకము నిముసములో నాక్రమింపగలరు. పాతాళము నతలం బొనర్పగలరు. మరియును మదీయ మాయా ప్రభావమునకు ద్రిభువనముల నెదురెయ్యదియైన గలదా ?


చ. పవలది రాత్రికా, నిశిఁ బవల్గతిఁ జంద్రుఁ డినుండులా గినుం
    డువిధునిమాడ్కి, జీకటిఁగడున్‌ వెలుఁగునట్లు, వెలుంగు నంథకా
    రవిధము, వార్ది నేలవలెఁ బ్రస్థల మంబుధిలీల నిట్లు వ
    స్తువులను మార్చి లోకమున దోడ్తనె విభ్రమ మందఁజేసిదన్‌.

ఇట్టి నేను దేవరయానతివడువున నీ కంకాళకుని సహాయముతో నంతరాళ యానమున బోయి యచ్చోటి కేతెంచువానిని నివారించి వచ్చెదనని విన్నపం బొనర్ప నా విభీషణుండు నీ యిచ్చవచ్చినట్లొనర్పుమని యానతిచ్చెను. తోడనే నేను గంకాళకు నితో లంకమీద కేతెంచనున్న యా మానవుని సమీపమున కరుగ బయలుదేరితిని.

పిమ్మట నచిరకాలముననే మలయమండలమున నొక మహారణ్య మధ్యమున నున్న జీర్ణచండికాలయమును దిలకించితిని. నిలువ దావులేని యీదురంతారణ్యమున దిరుగు నావీరాధ్వగు డొకప్పు డైన నీయాలయమును జేరుకొనక మానడని తలంచుచు నేనందేగితిని. అందు దేవిపటోపసేవకులగు వేదాళురు పలువురు నన్గాంచి యాలింగన కుశలప్రశ్నాదిసత్కా.రము లొనరించిరి. వారితో ముచ్చటించుచు నేనందు గొంత కాలము గడపితిని.

ఇంక జామురాత్రి యున్నదనగా బ్రాంగణమున నున్న కంకాళకుం డదరిపడుచు “అదిగో ! నేను చెప్పిన వీరు డిచ్చటికే వచ్చుచున్నా” డని నాకు జూపించెను.

నేనా యుదారమూర్తిని దిలకించి విస్మయపడుచు “వీనినిగూర్చికంకాళకుడు చెప్పినది యత్యల్పము. స్వరూపంబున భీమాదివీరులు వీనిని నిక్కముగ బోలనేరరు. స్వర్గలోకమందలి వీరులగూడా నతిశయించుచు వీనిరూప మొప్పియుండెను. కావున వీని చేష్ట లెరుగువరకు నీవేతాళవర్గముతో నదృశ్యుండ నై యుండెదంగాక” యని యట్లొనరించితిని. ఇంతలో నా పురుషపుంగవుండు గుడిలోని కేగి దేవికి నమస్క రించి బైట కేతెంచి యందున్న మండపముమీద నుపవిష్టుండయ్యెను.