పుట:కాశీమజిలీకథలు-12.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అందొకచో భ్రాతృయోగవిఘటితుండగు మారుతివలె మనుష్యురూపమందిన యాంజనేయువలె క్షత్రియకులమందవతరించిన యశ్వత్థామవలె, నరలోకమం దుద యించిన కా ర్తవీర్యునివలె నతిబలపరాక్రమసమేతుండగు రాజపుత్రుని గుమారకేసరి యనువానిని ద్యూత క్రీడాపరతంత్రుని నొక్క చోఁగాంచితిని. వానిద్యూతవిద్యా నైపుణ్యమున కక్కజపడుచు నేనచ్చటనే ప్రచ్చన్నముగ నుంటిని. పిమ్మట నారాజ పుత్రుండుకితవమి తులతో బుడమి నెందును వీరుడు లేకుండజేసి యెం దైన నొక ధనికుడగువాని ద్రవ్యమెల్ల నపహరించుకొనివచ్చి ద్యూతమునకై వినియోగించెద నను వాని బీరంపుమాటల నాలికించి వీడెంత కైన దగినవాడు, త్రిభువనముల వీని కసాధ్య మగునదెద్దియు నుండజాలదని తలంచుచు మఱియు నిట్లని యూహించితిని.

ఈ రాజపుత్రుండు ద్యూత క్రీడాభిరుచివలన నతిసాహసముతో గనకము కొరకు మేరువు నుత్పాటింపగలడు. రత్నేచ్చవలన ఫణీంద్రఫణా పటలమును విద ళింపగలడు. అర్థకాముడై కుబేరుని బంధింపగలడు. తొల్లి కపిమా తుడగు నాంజ నేయుడు దశకంఠునిచే బంధింపబడియును లంకాపురంబెల్ల భస్మ మొనరించియుండ లేదా ! భీమసేనుండును నాగలోకమున కేగి కాద్రవేయుల నెల్ల నిర్జించి యమృత కుండమును గైకొనలేదా ? వీడును స్వర్ణార్థియె లంకాపట్టణం బాక్రమింపదలచునేమో చూచెదను. వీని‌ ననుసరించియుండి యేమేమిచేయునో యెందెందు బోవునో తెలిసి కొందునుగాక యని నేను వాని వెన్నంటి తిరుగుచుంటిని.

వాడొక దినమందు దక్షిణదిక్కుగా బోయి యా రాత్రి కొకగ్రామము జేరుకొనెను. అందొక వృద్దకితవునియింట విడిసి‌ వానితో దాను దక్షిణసముద్రమున కావలనున్న యొక యమానుష ప్రచారమగు ప్రదేశమున కరుగుచున్నానని ప్రస్తావవశ మున జెప్పెను. ఆ మాట విని నేను చకితుండనైతిని. నేననుకొన్నట్లేయైనది. ఈ వీరుడు తప్పక లంకాపురమును నిగ్రహించుటకే పోవుచున్నాడు. దక్షిణసముద్రమున కావల రాక్షస‌ నివాసభూమి. లంకకాక యింకేమున్నది ? అమానుష ప్రచారమగు ప్రదేశమదిగాక యింకేది గలదు? వీని వెంటబోయి యింకను బరిశీలించెదగాక యని యదృశ్యరూపమున గ్రమ్మర వాని ననుసరించి పోవుచుంటినివాడతి జవమున దక్షిణా పధము నతిక్రమించుచుండెను.

తుదకు మలయమండలమును బ్రవేశించినతోడనే నాకాసందియము దీరినది. తప్పక లంకాపురమును ముట్టడించుటకే వాడేతెంచుచుండెనని నిశ్చయించుకొని యా వార్త దేవర కెరిగింపనతిజవమున నిందేతెంచితిని తిరుగ బలవంతుడగు పురుషపుంగవుడీ లంకను జయింప నేతెంచుచున్నాడు నాకు దెలిసిన వృత్తాంతమెల్ల నేలికకు నివేదించు కొంటిని. మీది కృత్యమునకు దేవరయే ప్రమాణమని యూరకుండెను.