పుట:కాశీమజిలీకథలు-12.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయాబలుని కథ

187

దోఁచును. రావణునిచే బంధింపబడి యనవరతము విలపించుచున్న త్రిదశవనితల కన్నీటిధారలచే మలినమైనరీతి వినీల మరకతశిలానిర్మాణహర్మ్యముల మాణిక్యకుట్టిమము లొప్పారుచుండెను. ఆ పట్టణమున రాక్షసుల కధీశ్వరుడై పులస్త్యుని పుత్రుండును, నంభోజసంభవ వంశప్రదీపకుండును నగు విభీషణుండు రావణవధానంతరము శ్రీరామునిచే లంకారాజ్య పట్టాభిషిక్తుడై నివసించియండెను. అతని ప్రఖ్యాతి త్రిభువన ములయందును వ్యాపించియున్నదిగదా !


చ. పురుషగుణాకరుండయి ప్రపంచ మహాపరితాపకుండునై
    పరగిన రావణుం డిసురవల్లభుఁడీల్గ విభీషణుండు, భా
    సురశిశిరాశయుండు, పరిశుభ్రసుధాత్మకమూర్తిరాజునై
    ఖరకరుఁ డస్తమింప శశికైవడి లోకహితంబుగూర్చెడిన్.

గీ. సహజదుష్టము నతిభయాస్పదమునైన
   దనుజకులమందుఁ బుట్టుకఁ గనెనుగాని
   యతఁడు విమలాకృతిని సేవ్యుఁడయ్యెఁ బ్రజకు
   ఫణిఫణాగ్రంబునందున్న మణివిధాన.

ఆ విభీషణునకు నేను మాతులసూనుండను. మాయాబలుండను వాడను. వెనుక రావణునిక్రోధమునకుగురియై యతండు వెడలగొట్టబడినప్పుడు నేనాపత్సహా యుండనై వెంటనుండి వానిమన్ననలకు బాత్రుండనైతిని. ఆ విభీషణరాక్షసేశ్వరుం డొకనాడు ప్రణయలోకముతో విలాసగోష్టిం బ్రొద్దుపుచ్చుచున్న సమయమున బ్రతీహారి సత్వరమె వచ్చి దేవా ! కంకాళకుండను రక్కసుం డెక్కడనుండియో యతిజవమున నేతెంచి దేవరదర్శన మతిశీఘ్రమున నభిలషించుచు వాకిట నిలిచియున్నాడు. ముదల యేమని మనవిసేయ నారాక్షసేంద్రుండు వాని నతిశీఘ్రమె ప్రవేశ పెట్టుమని యనుజ్ఞ నొసంగను. అంత బ్రతీహారిదారి జూప గంకాళకుండేతెంచి రాక్షసచక్రవర్తికి గృత ప్రణాముడై యేలినవారికి రహస్యముగా మనవి సేయదగినపని యున్నదని బలుకుట యును దక్కినవారందఱ నవలకుబంపి మద్ద్వితీయుడై యున్న యాదానవేంద్రునితో గంకాళకుండిట్లనియె.

దేవా ! దేవరచే నవనీతలమున నన్ని దిక్కులకు బంపబడిన వార్తాహారులలో నొక్కడనగు నేనుత్తర దిక్కుగాబోయి మహానదిం దాటి పిదప నర్మదనదీతీరమునున్న పెక్కుపట్టణముల దిలకించుచు గ్రమమున భృగుగచ్చమను నగర రాజముజేరితిని. ఆ పట్టణరామణీయకము దిలకించుచు గొన్నాళ్ళందు గడపి పిమ్మట నుత్తర దిక్కు నున్న గ్రామపురపట్టణములంగల విశేషముల బరికించుచు దుదకు గంసారిశైశవదశ కాస్పదంబైన మధురాపురమున కరిగితిని.