పుట:కాశీమజిలీకథలు-12.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఓహో ! నిజము దెలిసికొంటిని. భూమండలశరీరమునకు బ్రాణమనియును, బ్రహ్మాండశుక్తియందలి యాణిముత్తెమనియును, నరలోకన్యంజనమునకు మృగనాభి నాయకమనియును, భూకల్పలతికయందలి రత్నగుచ్చమనియును, జంబూద్వీపపదక మందలి మాణిక్యబంథమనియును, సకలభువనభూపాలచూడామణియనియును నెవ్వరు కీర్థింపబడుచుండిరో యట్టి ప్రతిష్టాననగర పరమేశ్వరునిగా గుంతలావనీనాధునిగా బండరీకరాజదేవేంద్రునిగౌ నిన్నెరింగితిని. నీ యత్యద్భుతచరిత్రము, నీవిక్రమక్రమము నీవిజ్ఞానసంపద, నీ యుదారస్వభావము, నీ యైశ్వర్యవిశేషము, నీ సద్గుణగరిమము నే నెన్నిసారులో ముల్లోకములయందును విని యానందించితిని. అంధకమధనునిచే బరా క్రమమున గొనియాడబడిన మదీయసామర్ద్యము నెదిరింప నీకుదక్క_ నితరులకు శక్య మగునా? త్రైలోక్యవిజయిని యగు నీమండలాగ్రము దనశక్తినుడిగి నీ పాదముల మ్రోల బడియుండుట విచిత్రముగదా! ఈ కృపాణమును నీకు గానుకగా నొసంగు చున్నాడను. ఈ తపస్వినిని విడచిపెట్టుచున్నాను. ఇక నాకు సెలవొసంగుము. పోయి వచ్చెదను. అవసరము గలిగినప్పుడు నన్ను దలంచినంతనే వచ్చి నీయాన నెరవేర్చి పోవుచుందు నని మిన్నకుండెను.

పుండరీకుండును విస్మయకౌతుకావేశ హృదయుడై యిట్లనియె. అసమ సమరాంతమున నొనగూడిన మనమైత్రి శుభదాయకమై చిరము వర్దిల్లుగాక. ఇందు నాకు నిషచరధౌరేయుడగు మిత్రుడలవడినందుల కెంతయును సంతసించుచుంటిని. నీవృత్తాంత మెరుంగుటకు నా మనం బుత్సహించుచున్నది. నీ వెవ్వడవు? రక్కసుండ వైనను నీయందు సద్గుణము లుండుట గ్రహించితిని. ప్రభావసంపన్నంబగు నీమండ లాగ్రము నెందుండి యెట్లు సంగ్రహించుకొనివచ్చితివి. ఉన్నతాశయుండవగు నీవీ తపస్వినిని దయమాలి యేమిటి కట్లేడ్పించితివని ప్రశ్నించు నరేంద్రున కా దాన వేంద్రుం డిట్లనియె.

332 వ మజిలీ

మాయాబలునికథ

దేవా అవధరింపుము ! దక్షిణసముద్రమున కావల కనకమయా శేష వస్తునిస్తులంబై యత్యంత శోభాయమానమగు లంకాపురము గలదని వినియేయుందువు. అచ్చట‌ దశకంఠునిశాసనమునఁ గట్టపడినసమీరణుం డిప్పటికిని బ్రబలదాయకపతాకాగ్ర ములఁ‌ దన వణకు గనుపింప నతిభయంబున నప్పురంబునుఁ బ్రవేశించుచున్నట్లు