పుట:కాశీమజిలీకథలు-12.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాక్షసుని గర్వభంగము

185


గీ. అతిశయభుజప్రతాపాగ్ని యలమియుండ
    లేదు నాయందుఁ జోటేమి నీదువహ్ని
    కింక వినుమ ! నీగృహమున కేఁగి బంధు
    జనులఁ గలయుమ, సమరభీషణత మాని.

ఇట్లు నీవొనర్ప వేని యందులకు దగుఫలం బిప్పుడే యనుభవింపగలవని యారక్కసునితో బలుకుచుదనలోనిట్లనుకొనెను ఈ యనలతీవ్రమున జల్లనినీటిచే ముందు జల్లార్చిపిదపమదీయఖడ్గప్రహారమున నీరాక్షసాథముని దెగటార్చెదను. జలము లేనప్పు డార్ద్రతరుపల్లవమున నైన నగ్నిని జల్లార్పవచ్చును. కావున నట్లొనరించెదం గాక యని నిశ్చయించి వామకరమున గృపాణము దాల్చి సవ్యకరమున‌ జేతికందిన పృథుదళాతిమాంసల పల్లవంబగు నయ్యశ్వత్థశాఖను గ్రహించి యోరోరి హింస కాధమా! నిలునిలు మని యతిసాహసమున నారాత్రించరాధముని మార్కొనెను.

అట్లు భీకరాగ్నిజ్వాలల కించుకయును వెరువక సాంద్రప్రవాళభాసురం బగు తరుశాఖం గొని యుద్ధసన్నద్ధుడగుచున్న యీరాజపుంగవుని యవక్రవిక్రమము నీక్షించుచున్న యంతరిక్షచరులు సాధువాదము లొనరింపసాఁగిరి. మరియు నాసంగ రమును దిలకించుచున్న నేకాదశరుద్రులును నాపుండరీకుని ధైర్యసాహసముల కత్య ద్బుతరసావేశహృదయులై తలలుపంకించుచుండ దదీయజటాజూటములనున్న జాహ్నవీ ప్రవాహము జారి పుడమిపై బడెను. ఏకాదశరుద్రుల యుత్తమాంగములనుండి గంగా జలం బేకధారగాబడిముంచుటంజేసి యాశవాశనుని వైశ్వానరసృష్టియెల్ల దృటిలో విధ్వస్తంబయ్యెను.

అప్పు డప్పిశితాశనుండు విస్మితుం డగుచు నతిసంభ్రమమున మృత్యువు శిఖాదండమువలె, సురేంద్రుని రెండవవజ్రాయుధమువలె, కాలమహిషము తృతీయ శృంగమువలె, త్రికూలము చతుర్ధకోణమువలె నభ్రకుంజరము పంచమవిషాణమువలె విశేషభీషణమై, దనుజదారుణా ఘాతమున విఘటితంబైన నృసింహదేవునితీవ్రనఖము వలె నిశితమైన మండలాగ్రంబొండు బిడికిటంబట్టి దానివ్రేటును బ్రతివీరుండు దప్పించుకొని‌పోకుండ నడ్డు పెట్టినట్లు బాహువుల జాపుకొని తీక్ష్ణదృష్టుల నిగుడించుచు నౌడుగరచి పదఘట్టనమున బుడమి యదుర నా రక్కసు డుక్కుమిగిలి యాదారుణ కృపాణము బుడమీశ్వరునిపై విసరెను.

అప్పు డాఖడ్గోత్తమంబాభూపాలోత్తమునిదరికరిగి పదక్షణ పూర్వకముగ వాని పాదమూలమున బడిపోయను. తోడనే యా రక్కసుడు విభ్రాంతుడై సంగ్రామ దారుణవేషమువిడచి చేతులు జోడించుకొని వినయవినమితోత్తమా గుడై యానరేం ద్రునకు జోహారులొనరించుచు నిట్లనియె.