పుట:కాశీమజిలీకథలు-12.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

భంబున దిగ్గజముగరంబు బట్టుకొని యాటలాడ నెందులకు బూనెదవు? ఆపన్న పరిరక్షణా సక్తివలన విశ్వైక వీరుండనగు నాతో నేల యుద్ధమునకు డీకొనెదవు? దురంతమగు నీ విఫల ప్రయత్నము నుండి వైళమ విరమింపుము. రణవిముఖుల నీ రాక్షసప్రవ రుండు క్షమించునని యెరుంగు మని పలుకు పలభుజున కాభూభుజుం డిట్లని ప్రత్యు త్తర మొసంగెను.

ఓరోరీ ! దుర్మదాంధా ! ఈ వ్యర్థాలాపములతో నాహవమహోత్పవమున కంతరాయమును గల్పింప జూచెదవేమిటికి ? స్వప్రశంసాపరాయణుండవై బహు భుజులకైన జయింపరాని వాడవని జెప్పికొని ద్విభుజుండనగు నన్నపహాస్య మొన ర్చుచు నీవంటి పిశాచజన్ముల నగ్గించుచుంటివా ? స్వసామర్థ్యమే నరులకు బహు బాహుత్వమని యెరుంగవా ? నిశాచరచక్రవర్తియగు రావణుండువింశతి భుజుండైనను ద్విబాహుండగు శ్రీరామునిచే దలలు నరుకబడి మడియుట మరచితివా యేమి ? భుజ సహస్రవిశ్రుతుండగు కార్తవీర్యుండు భార్గవునిచే నిర్జింపబడుట యెరుంగవా ? కావున నోరిమూఢ ! వీరులకు యుద్ధసమయమున ద్విబాహుత్వమే యుపకరింప గలదని దెలిసికొనుము.


చ. అలఘుమతుల్‌ ద్రిలోకవిజయమున దక్షిణహస్తమున్‌, భయా
    ర్తుల కభయప్రదానముఁ దోడ్తన వామకరంబున, వాడఁగా
    గల రిఁక నిన్నుఁబోలు మదగర్వులు స్వోదరపూర్తికొక్క కే
    ల్మల నిగమప్రదేశ సమమార్జన కింకొక కేల్గ్రహింపరే?

హరి హరాదులకైన నసాధ్యుండనని బల్కుచు ద్రైలోక్య పంద్యులంగూడ నీసడించుచున్న నీ నాలుక దుత్తునియలు గాలేదా ? కాకున్న నానిశితాసిం దాని నిప్పుడే వేయిచీలికలుగా గోసివైచెదం జూడుము. ఓరీ ! పాపాత్మా ఆత్మప్రశంసాపరాతాణా ! వృధావాగాడంబరా ! మాటలవలన గాక పరాక్రమము సమరమున జూపింపుము. రమ్ము. రణమున కాయత్తము గమ్ము. అనిలో ముందు బాణ మేయనని నాకు శపధ మున్నది. కావున దొలుత నీవే నాపై గవిసి ప్రహరింపుము. పిమ్మట నిముసములో మదీయతీవ్రాసిధారల నీశిరము దృళ్ళి ధరణిపై బడగలదు. నిన్ను నిర్జించి యీ బాల తపస్వినిని రక్షించెదనని శౌర్యమదోద్రేకదారుణములగు రణాలాపంబు లారాజేం ద్రుండు బలుకుచుండ నా రక్కసుండు ప్రతిభటబాభమున కానందించుచు వానివీరా లాపముల కక్కజపడుచు దదీయ భుజబలమునకు జకితు డగుచు నట్టివానితో సంగర మున గలియ ద్వరపడుచు నా సమయమునకు దగిన రోషము దెచ్చుకొని యిట్లనియె.

సాధు ! రణకౌండీర ! సాధు! నే ననేక దారుణసంగ్రామముల నారితేరిన వాడను. నీవో పిన్న వయస్కుండవు. నన్ను బోలు రాక్షసులతో నీవింతదనుక నెన్న