పుట:కాశీమజిలీకథలు-12.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యానగర పరిసర భూమియందుఁ బడెను. తోడనే హృదయవిద్రావకంబుగ మర్మ విచ్చేదకముగ నెడతెగని యార్తధ్వని యా భూజానికి దూరమునుండి వచ్చుచుండుటచే నస్పష్టాక్షరార్థంబుగ వినంబడఁదొడంగెను.

పుండరీకుం డాయాక్రోశరవం బాలించి యౌరా ! ఆ యద్భుత తమోరాశి వెంటనంట నంబరమునుండి పుడమి కేతెంచిన దెవరై యుండును ? ఆ యార్తనాదంబు నకుఁ గతం బేమై యుండును ? ఏమైన గానిమ్ము. ఆర్తపరిత్రాణమే ధర్మముగదా ! అందును ధాత్రీశ్వరుండగు క్షత్రియున కాధర్మ మవశ్యకర్తవ్యము, కావున నే నిప్పుడే పోయి యాపదపాలైన యావ్యక్తి నాశ్వాసించెదను. ప్రసంగ వశమునఁ దదీయ యన్వ యాభిధానాదులం దెలిసికొందునుగాక యని యందుండి లేచి వీరపురుషోచితవేషము ధరించి కృపాణధారియై యాచీకఁటిలో నొరులెరుఁగకుండ నతిజవంబున నా యార్త ధ్వని ననుసరించి పోయెను.

అట్లు పోయి స్మశానవాటిక యందున్న చండికాదేవి శూన్యాయతనమున కనతిదూరములో విశాలశ్వత్థవృక్షము క్రింద మహాంధకార కూపోపకంఠమున నతి, మలినాకృతిఁగల యొక వ్యక్తినిఁ జూచెను. అయ్యతి త్రివిక్రమ స్వరూపముకన్న దీర్ఘమై యాకసముకన్న నున్నతమై యుండెను. మరియును మహామారి గర్భపాతమువలె రక్తోపవర్ది తాంగముగలిగి భువనభోజనుండగు కృతాంతునియతిధివలె, కాల్పాంతసంచా రుండగు భైరవుని సహాయునివలె నంధకాసురసంహారమునకుఁ జండిక యేర్పరఱచు కొనిన సేనానివలె, శక్తియొక్క పురుష స్వరూపమువలె, భయంకరన్వరూపము గలిగి మండుచున్న నేత్రద్వయముతో దారుణమగు వదనగహ్వరము గలిగి, యందుండి వెడలు పృధుతరానేక వహ్నిచ్చటలు మాటిమాటికి రక్తాస్రవము గ్రోల వ్రేలాడు రస నాళతమువలె నొప్పుచుండ భూషణీకృతానేక నరకరోటుండై భయంకరాకార భాసు రుండగు రాక్షసుం డొకండు గృతాంతునికన్న నుగ్రుడై మృత్యువుకన్న హింస కుండై గన్పట్టెను.

ఆ నిశాచరాధముని యమదండభీషణంబగు భుజదండముచే నయ్యంధ కూబోదరమునుండి బైకెత్తి పట్టుకొన బడియుండి యతి దీనమున నాక్రందించుచు, భయతరళితంబులగు జూపుల దిక్కుల బ్రసరింపజేయుచు, గడగడ వడంకుచున్న నిజతనూలత యానక్తంచరుని మేనఁగల తెల్లని నరకపాల మాలికాభరణమున ప్రతి ఫలింప వానినే శరణు జొచ్చియున్నట్లు గనుపించుచు, జటావల్కముల ధరించి చేతి యందు రుద్రాక్షమాలికం గ్రహించి యోగ పట్టికం బూని యొడలెల్ల భస్మ మలంది కొని లలాటంబున జంద్రలేఖంబూని ప్రశాంత సుందరాకారముతో బదునాలుగేండ్ల వయసున నున్న యొక కన్యాతపస్విని యారాజోత్తమునకుగోచరమయ్యెను.